Begin typing your search above and press return to search.

అమ్మకు కోపం వస్తే ఏమవుతుందంటే..?

By:  Tupaki Desk   |   4 Jan 2016 10:43 AM GMT
అమ్మకు కోపం వస్తే ఏమవుతుందంటే..?
X
వినటానికి విచిత్రంగా ఉన్నా.. తమిళనాడులో ఒక మాటను జర్నలిస్ట్ వర్గాలు తరచూ ప్రస్తావిస్తుంటాయి. తమ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి.. తమ ముఖ్యమంత్రి జయలలిత గురించి ఇతర రాష్ట్రాల పాత్రికేయులు కలిసినప్పుడు వారు చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తాయి. అలాంటి ముచ్చట్లలో ఒకటి.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉంటే.. ఆమె మంత్రివర్గంలోని మంత్రులంతా నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తారు? అన్న విషయాన్ని చెబుతూ.. మరో ఆలోచన లేకుండా మెలుకువ వచ్చిన వెంటనే.. తమ పోర్టికోలోకి వెళ్లి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వాహనం ఉందా? లేదా? అని చూసుకుంటారట. ఒకవేళ.. కారు ఉంటే.. మంత్రి పదవి ఉన్నట్లు. లేకుంటే.. మంత్రిపదవి చేజారినట్లే అని చెబుతారు.

మంత్రులను అంత సింఫుల్ గా అమ్మ మార్చేస్తారా? అంటే.. అవునని చెబుతారు. అమ్మ అనుగ్రహాన్ని భరించటం ఈజీ కానీ.. ఆగ్రహం వస్తే మాత్రం భరించటం చాలా కష్టమని చెబుతారు. ఈ మధ్య కాలంలో అమ్మ ఆగ్రహాన్ని చూడని వారికి.. ఆమె నిర్ణయాలు ఎంత కరుకుగా ఉంటాయన్న విషయం తాజాగా మరోసారి తెలిసి వచ్చింది.

అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్రచార ఉప కార్యదర్శి నాంజిల్ సంపత్ పదవిని రాత్రికి రాత్రే పీకేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాంజిల్ ఏమైనా చిన్నోడా అంటే కాదనే చెప్పాలి. సమకాలీన రాజకీయ అవగాహన సంపూర్ణంగా ఉండటంతో పాటు.. అనర్గళంగా మాట్లాడే నేత. వైగోకి వెన్నుముకలా నిలిచి.. ఈ మధ్యనే అన్నాడీఎంకే గూటికి చేరారు. వైగో పార్టీలో తనకు అలవాటైన స్వేచ్ఛను.. అన్నాడీఎంకేలో ప్రదర్శించి.. అడ్డంగా బుక్ అయ్యారు.

ఈ మధ్యన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూను చూసిన పలువురు ఆయనకు మూడిందని అనుకున్నారు. అమ్మ తత్వం తెలీని ఆయన తొందరపడి మాట్లాడటంతో ఆయన పార్టీ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ వివాదాస్పదమైనవా? అంటే కాదనే చెప్పొచ్చు. కాకుంటే.. విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం ఇచ్చేలా ఆయన మాట్లాడారు. అంతే.. ఇంటర్వ్యూ బయటకు రావటం.. నాంజిల్ మీద వేటు పడటం జరిగిపోయాయి. మిగిలిన అధినేతలు కాస్త అయినా ఉపేక్షిస్తారేమో కానీ.. అమ్మ మాత్రం వేటు వేసేందుకు ఎలాంటి మొహమాటపడరన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైందని చెప్పొచ్చు.