Begin typing your search above and press return to search.

ఒక.. మోడీకి ఫ్రెండ్ గా ‘అమ్మ’

By:  Tupaki Desk   |   4 Jun 2016 6:16 AM GMT
ఒక.. మోడీకి ఫ్రెండ్ గా ‘అమ్మ’
X
కొంతమందికి రోజులు అలా కలిసి వస్తాయి. మూడు దశాబ్దాల నాటి రికార్డును బ్రేక్ చేసి.. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తమిళనాడు ‘అమ్మ’.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. బోలెడన్ని వరాలు గుప్పించి తంబీల మనసుల్ని దోచుకున్న అమ్మ.. ఆ హామీల్ని తీర్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు తానుగా కంటే కేంద్రం సాయాన్ని తీసుకుంటే పని మరింత సులువు అవుతుందన్న ఆలోచనలో ఆమె ఉన్నారు. అదే సమయంలో మోడీకి సైతం అమ్మ అవసరం చాలానే ఉంది. కీలకమైన బిల్లులు లోక్ సభలో సులువుగా పాస్ చేయించుకున్నా.. బలం లేని రాజ్యసభలో ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం పొంచి ఉండటంతో ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి.

వచ్చే ఎన్నికల నాటికి దేశ పాలనలో తన ముద్ర చూపించాలని తపిస్తున్న ప్రధాని మోడీకి.. రాజ్యసభలో బలం లేకపోవటం ఇబ్బందిగా మారింది. బీహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో రాజ్యసభలో బలం పెరిగే అవకాశాల్ని దెబ్బ తీసింది. వచ్చే ఏడాది అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అంటే అనుమానమే. ఎందుకంటే.. యూపీలో జరిగే ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిస్తారన్నది అంతుచిక్కనిదిగా తయారైంది. ఈ నేపథ్యంలో కొత్త స్నేహాలు మోడీకి అవసరమయ్యాయి.

అదే సమయంలో ప్రజలకిచ్చిన హామీల్ని అమలు చేయటానికి అవసరమైన నిధులతో పాటు.. కేంద్ర అభయహస్తం ఉంటే తన పని తాను చేసుకుపోవచ్చన్న ఆలోచనలో ఉన్న అమ్మ కేంద్రంతో ఫ్రెండ్ షిప్ చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఈ నెలాఖరుకు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. 39 మంది లోక్ సభ సభ్యులు.. 12 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉన్న అమ్మతో మోడీ సర్కారుకు ఫ్రెండ్ షిప్ పక్కా అయితే.. రాజ్యసభలో బలం మరింత పెరిగే వీలుంది. అదే జరిగితే.. జీఎస్టీ బిల్లుతో సహా.. కీలక బిల్లులకు మోక్షం కలిగే వీలుంది. అమ్మ బలాన్ని చూసిన బీజేపీ నేతలు అమ్మతో స్నేహహస్తం చాచేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో అమ్మ కూడా మోడీతో స్నేహానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. కాకుంటే.. ఎన్డీయే కూటమిలో అమ్మ చేరదని.. కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. చూస్తుంటే.. లిమిటెడ్ గా ఫ్రెండ్ షిష్.. అన్ లిమిటెడ్ గా తన అవసరాల్ని తీర్చుకోవటమే అమ్మ లక్ష్యంగా కనిపిస్తున్నట్లుందే. పావలా ఇచ్చి పది రూపాయిలు ప్రయోజనం పొందాలని అనుకునే మోడీ.. అమ్మ డీల్ కు ఎలా స్పందిస్తారో చూడాలి.