Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఫార్ములా ఫాలో అయిన ‘అమ్మ’

By:  Tupaki Desk   |   23 May 2016 10:09 AM GMT
చంద్రబాబు ఫార్ములా ఫాలో అయిన ‘అమ్మ’
X
పదేళ్ల పాటు అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి వేసిన మంత్రం రుణమాఫీ. ఆ హామీ చంద్రబాబును పక్కాగా అధికారంలోకి తెచ్చింది. చంద్రబాబు అంచనాలకు తగ్గట్టుగానే రుణమాఫీ ఆయనను అధికారానికి చేరువ చేసింది. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి సంతకాన్ని రుణమాఫీ ఫైలుపైనే పెట్టారు. ఇప్పుడు తమిళనాడులో రెండోసారి అధికారంలోకి వచ్చిన జయలలిత కూడా అదే ఫార్ములాను నమ్మకున్నారు. రుణ మాఫీతో పాటు పలు ‘ఉచిత’ హామీలు ఇచ్చారు. అవన్నీ ఫలించి జయకు ముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో జయ కూడా తనను గెలిపించిన రుణమాఫీ హామీని అమలు చేయడం కోసం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం కోసం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన తొలిసంతకాన్ని రుణమాఫీ ఫైలుపైనే పెట్టారు.

దీంతోపాటు ఆమె ఎన్నికల వేళ ఇచ్చిన మిగతా హామీలపై చర్యలకూ సిద్ధమయ్యారు. విద్యుత్ సబ్సీడీలు తదితరాలపై సంతకం చేసేసిన జయలలిత... రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని కుదిస్తూ అధికారులు రూపొందించిన ఫైలుపై కూడా సంతకం చేశారు. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ కానున్న మద్యం షాపులు రాత్రి 10 గంటల దాకా మాత్రమే విక్రయాలు కొనసాగుతాయి.

జయలలిత ఎన్నికలకు ముందు అధికారం నిలబెట్టుకోవడానికి పెద్ద కసరత్తే చేశారు. పొరుగు రాష్ట్రాల సహా మిగతా రాష్ట్రాల్లో విధానాలనూ పరిశీలించారు. అందులో అన్నిటికంటే మిన్నగా ఆమెను రుణమాఫీ ఆకర్షించింది. తమిళనాడులో అలవాటైన ఉచిత హామీలతో పాటు కాస్త భిన్నంగా ఈ రుణమాఫీని కూడా ఆమె హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ప్రజలు దానికి ఫిదా అయి అమ్మను గెలిపించారు. దీంతో ఆమె ఎంతో కీలకమైన రుణమాఫీ పైలుపైనే తొలి సంతకం చేశారు. మిగతా ఉచిత హామీల అమలుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.