Begin typing your search above and press return to search.

అమ్మకానికి 7 కేజీ బంగారం.. 600 కేజీల వెండి.. 11వేల చీరలు.. 750 చెప్పులు.. ఎవరివంటే?

By:  Tupaki Desk   |   9 April 2023 10:55 AM GMT
అమ్మకానికి 7 కేజీ బంగారం.. 600 కేజీల వెండి.. 11వేల చీరలు.. 750 చెప్పులు.. ఎవరివంటే?
X
అమ్మకానికి అమ్మ ఆస్తులు అందుబాటులోకి రానున్నాయి. అక్రమార్జన కేసులో అప్పుడెప్పుడో స్వాధీనం చేసుకున్న అమ్మగా సుపరిచితురాలు.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల్ని వేలం ద్వారా అమ్మేందుకు రంగం సిద్ధమవుతోంది.

అవినీతి ఆరోపణల మీద అధికారులు స్వాధీనం చేసుకున్న భారీ ఆస్తుల్ని తాజాగా వేలం వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అప్పట్లో అవినీతి ఆరోపణలతో అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున అమ్మ ఆస్తుల్ని సీజ్ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఎదుర్కొన్న విమర్శలు అన్ని ఇన్ని కావు. 1996లో చెన్నైలోని జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్ని కర్ణాటక అధీనంలో ఉన్నాయి.

వీటిల్లో 7కేజీల బంగారం.. వజ్రాభరణాలు.. 600 కేజీల వెండి.. 11 వేలకు పైగా చీరలు.. 750 జతల చెప్పులు.. 91 వాచ్ లు.. 131 సూట్ కేసులు.. 1040 వీడియోక్యాసెట్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు.. విద్యుత్తు పరికరాలు ఉన్నాయి.

వీటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు సాక్ష్యాల రూపంలో కోర్టు కస్టడీలో ఉంచారు. వీటిని అమ్మేందుకు వీలుగా కసరత్తు షురూ చేశారు. ఇదంతా చూసినప్పుడు బతికి ఉన్నంత కాలం సంపాదించాలన్న ఆరాటం తప్పించి బతుకు మీద ఫోకస్ పెట్టని వారికి ఒక గుణపాఠంగా మారుతుందని చెప్పాలి.

కోట్లకు కోట్లు వెనకేసినా.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్నా.. చివరకు పోయిన తర్వాత అవేమీ వెంట రాకపోగా.. అవన్నీ భవిష్యత్తులో మరకలుగా మారతాయన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వారసులు ఎవరూ లేకున్నా.. సంపాదన కోసం పడిన పాట్లు ఇప్పుడు వేలం పాటతో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేస్తాయని మాత్రం చెప్పక తప్పదు.