Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు వీర విధేయుడికి అమ్మ అనుగ్రహం

By:  Tupaki Desk   |   20 March 2016 4:16 AM GMT
ఎట్టకేలకు వీర విధేయుడికి అమ్మ అనుగ్రహం
X
విధేయతకు కేరాఫ్ అడ్రస్ మాదిరి ఉంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు ఓ సెల్వంపై అమ్మ ఆగ్రహం కాస్తా అనుగ్రహంగా మారిందన్న మాట వినిపిస్తోంది. తనకు ఎలాంటి కష్టమొచ్చినా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మరో మాటకు అవకాశం లేకుండా.. అమ్మ జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే పన్నీరు సెల్వాన్ని గడిచిన కొద్ది రోజులుగా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

పన్నీరు ఓ సెల్వంతో పాటు.. మరో ఐదుగురు సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టటం ద్వారా అమ్మ జయలలిత సంచలనం సృష్టించారు. సీనియర్ల విషయంలో అమ్మ వైఖరి ఒక పట్టాన అర్థం కాక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే.. అలాంటి చర్చకు తాజాగా అమ్మ ఫుల్ స్టాప్ పెట్టింది. తనదైన శైలిలో గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న నిర్ణయంతో.. నిన్నటి వరకూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆరుగురు మంత్రులు.. తాజాగా యాక్టివ్ కావటమే కాదు.. ఎన్నికల ప్రక్రియలో జోరు పెంచటం స్పష్టంగా కనిపించింది.

అమ్మ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవటంతో పాటు.. పెద్ద ఎత్తున తప్పుడు పనులకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో పన్నీరు ఓ సెల్వంతో సహా మొత్తం ఆరుగురు మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించింది. వారిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచటంతో పాటు.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫు పోటీ చేయాల్సిన అభ్యర్థుల విషయంలోనూ వారికి ఎలాంటి బాధ్యత అప్పగించకపోవటం చర్చనీయాంశంగా మారింది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లను పక్కన పెట్టిన వైనం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో రావటం మొదలయ్యాయి. అయినప్పటికీ.. అధికారపక్షం నుంచి ఎలాంటి వివరణ ఇచ్చింది లేదు. అయితే.. ఉన్నట్లుండి ఏమైందో తెలీదు కానీ.. గతంలో మాదిరే ఆరుగురు సీనియర్లకు పెద్దపీట వేయటం షురూ అయ్యింది. తాజాగా ఈ ఆరుగురు సీనియర్ మంత్రుల బృందం.. అన్నాడీఏంకే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావటం.. వారికి అక్కడి నేతలు ఘన స్వాగతం పలకటం.. అనంతరం వివిధ సంఘాల వారు అధికారపార్టీకి తమ మద్దతు పలికేందుకు రాగా.. వారితో ఈ సీనియర్ మంత్రుల బృందం భేటీ కావటం గమనార్హం.

మొత్తంగా నిన్న మొన్నటి వరకూ దూరంగా పెట్టిన ఆరుగురు సీనియర్లను అమ్మ కురుణించిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నటివరకూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వ్యవహరించిన అమ్మ.. ఇప్పుడు అనుగ్రహించటం వెనుక అసలు కథేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోయిస్ గార్డెన్ (జయలలిత నివాసం)లో జరిగే అంతరంగిక అంశాలు అంత తేలిగ్గా బయటకు వస్తాయా..?