Begin typing your search above and press return to search.

అమ్మకు అనుమానం వస్తే ఇలానే ఉంటుంది

By:  Tupaki Desk   |   17 March 2016 6:36 AM GMT
అమ్మకు అనుమానం వస్తే ఇలానే ఉంటుంది
X
విధేయతకు మారుపేరుగా భరతుడ్ని చెబుతారు. అన్న మీద అభిమానంతో అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడి పాదరక్షల్ని (చెప్పుల్ని) సింహాసనం మీద ఉంచి.. ఆయన పేరు మీద రాజ్యాన్ని పాలిస్తాడు భరతడు. ఇదంతా రామాయణంలోని కథ. కానీ.. అభినవ రాజకీయ భారతంలో ఇలాంటి భరతుడు కనిపిస్తాడా? ఏ చిన్న అవకాశం వచ్చినా అధినేతకే షాకిచ్చి పదవులు కొట్టేసే రాజకీయాల్లో భరతుడు లాంటి విధేయత ఉన్న వ్యక్తి సాధ్యమేనా అన్న సందేహాలు అక్కర్లేదు. మన పొరుగున ఉన్న తమిళనాడులో ఇలాంటి భరతుడు ఒకరున్నారు. ఇప్పటికే ఆయన మీకు గుర్తుకు వచ్చేసి ఉండాలి.

అవును.. జయలలితకు అత్యంత నమ్మకస్తుడు.. అమ్మకు అపర విధేయుడు ఓ. పన్నీరు సెల్వం. అతని విధేయత గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మకు కష్టం వచ్చి జైలుకు వెళ్లాల్సి వచ్చినా.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నా.. మరో ఆలోచన లేకుండా పన్నీరు సెల్వానికి సీఎం పదవిని అప్పజెప్పేయటం తెలిసిందే. అమ్మ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటమే కాదు.. అమ్మ పేరిట నమ్మకంగా పని చేయటంలో సెల్వానికి పోటీ వచ్చే రాజకీయ నేత కనిపించడు.

ఆ మధ్య అమ్మ జైలుకు వెళ్లిన సమయంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన ఆయన.. సీఎంగా అమ్మ బాధ్యతలు నిర్వహించిన కార్యాలయానికి తాళం వేసేసి.. తన మంత్రిత్వ శాఖా కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన విధేయుడు పన్నీరు సెల్వం. అలాంటి ఈ అభినవ భరతుడికి ఇప్పుడో పెద్ద కష్టం వచ్చింది. నిన్నటివరకూ నమ్మిన అమ్మ.. ఇప్పుడాయనను అనుమానంగా చూస్తోంది. దీంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారటమే కాదు.. పలు అవమానాలు ఎదురవుతున్నాయి.

ఇంతకీ ఆయన మీద అమ్మకు అంత అపనమ్మకం ఏమిటంటే.. పన్నీరుసెల్వం అమ్మ పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని రవ్వంత డౌట్ వచ్చేసింది. అంతే.. ఆయన్ను పక్కన పెట్టేయటమే కాదు.. పార్టీకి సంబంధించి కీలకమైన ఏ సమావేశానికి ఆయన్ను ఆహ్వానించటం లేదు. అంతేకాదు.. ఆయనకు ఈసారి టిక్కెట్టు ఇస్తారా? అన్నది కూడా పెద్ద సందేహంగా మారింది.

పార్టీలో ఆయన తన వర్గాన్ని పెంచుకోవటం.. తన కుటుంబ సభ్యులకు పార్టీ టిక్కెట్లు ఇప్పించుకోవటానికి ప్రయత్నించటం లాంటివి చేస్తున్నారన్న సందేహాలే పన్నీరుసెల్వానికి శాపంగా మారాయి. ఇలాంటి వారిని దగ్గరకు తీస్తే తనకు ముప్పు వాటిల్లుతుందని భావించిన అమ్మ.. ఆయన్ను తన దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మ నిరాదరణతో పన్నీరు సెల్వం తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నాడట. అమ్మకు అనుమానం వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో..?