Begin typing your search above and press return to search.

జాతీయ ఛానెళ్ల సర్వేలు చిరిగిపోయాయి

By:  Tupaki Desk   |   19 May 2016 6:25 AM GMT
జాతీయ ఛానెళ్ల సర్వేలు చిరిగిపోయాయి
X
అంచనాలు తలకిందులు కాబోతున్నాయ్. జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ చెత్త బుట్టలోకి వేయాల్సిందే. తమిళనాట చరిత్ర చిరిగిపోనుంది. ఐదేళ్లకోమారు అధికారం మారే తమిళనాట ఆ సంప్రదాయానికి తెరపడబోతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతోంది. జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా.. స్థానిక సర్వేల ప్రకారమే జయలలిత తిరిగి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు. తమిళనాట ఎన్నికలకు ముందు చేసిన సర్వేల్లో.. ఎన్నికల రోజు జరిపిన ఎగ్జిట్ పోల్స్ లో అధికార మార్పిడి జరగబోతోందని.. డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఉమ్మడిగా ఒకే అభిప్రాయం వెల్లడించాయి జాతీయ ఛానెళ్లు. ఒక్క టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో మినహాయిస్తే అందరూ డీఎంకేకే పట్టం కట్టారు. కానీ చివరికి టైమ్స్ ఎగ్జిట్ పోల్సే వాస్తవం అవుతున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా ఐదేళ్లకోమారు కచ్చితంగా అధికార మార్పిడి చేయిస్తున్న తమిళ ఓటరు ఈసారి మాత్రం రూటు మార్చాడు. జయలలితకే అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నాడు. కరుణానిధికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. ఎన్నికల ఫలితాల ప్రాథమిక ట్రెండ్ చూస్తుంటే ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం దాదాపు ఖాయమని తెలుస్తోంది. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే 130కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. డీఎంకే లెక్క 90కి కాస్త అటు ఇటుగా ఉంది. మిగతా పార్టీల అభ్యర్థులు కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నారు. విజయ్ కాంత్ నేతృత్వంలోని కూటమి మట్టికొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఓట్లను చీల్చడమే జయలలితకు మేలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమ్మ-కరుణానిధి పోటీ పడి ఉచిత వాగ్దానాల మోత మోగించగా.. తమిళ ప్రజలు అమ్మ చెప్పిన మాటల్నే నమ్మారు. ఆమె పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆమె వాగ్ధానాల్ని నమ్ముతూ ఆమెకే మెజారిటీ ప్రజలు ఓట్లేశారు.