Begin typing your search above and press return to search.

అమ్మ అనారోగ్యంపై ఆందోళన.. సందేశాలు!!

By:  Tupaki Desk   |   24 Sep 2016 7:58 AM GMT
అమ్మ అనారోగ్యంపై ఆందోళన.. సందేశాలు!!
X
తమిళనాడు ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో మరోసారి ఆమె ఆరోగ్యానికి సంబందించి కొత్త కథనాలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. ప్రస్తుతం తీవ్ర జ్వరం - డీ హైడ్రేషన్ తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెను మరింత మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నారని, జయలలితకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానితోపాటు కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవడమే దీనికి కారణమని ఆ కథనాల సారాంశం!

అయితే.. తమ అభిమాన నాయకురాలు - ముఖ్యమంత్రి - అమ్మ జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు - పూజలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జయలలితను సింగపూర్ కు తరలిస్తున్నారనే కథనాలు రావడంతో ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అమ్మ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నట్లు సమాచారం.

అయితే ఈ కథనాలను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు - నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమె సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని, ప్రస్తుతానికి అమ్మకు అంతా బాగానే ఉందని, ఆమెను సింగపూర్ తరలించడం లేదని వారు చెబుతున్నారు. దీనిపై ఇంతవరకు అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ప్రముఖుల సందేశాలు::

తీవ్రజ్వరం - డీహైడ్రేషన్‌ తో బాధపడుతూ చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. "డియర్ సీఎం మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో జయలలిత త్వరగా కోలుకోవాలని - ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ సందేశం పంపించారు. ఎప్పటిలాగే జయలలిత ప్రజలకు సేవ చెయ్యాలని కోరుతూ ఆమెకు ఒక బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి ప్రధానికి లేఖ రాశారు.

అలాగే, డీఎంకే అధినేత కురుణానిధి - ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ తదితర నాయకులు జయలలిత త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపించారు.

ఇదే సమయంలో తమిళనాడు ఇన్‌ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ విషయంపై స్పందించారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/