Begin typing your search above and press return to search.

అమ్మ వీలునామా ఆయ‌న ద‌గ్గ‌ర ఉందట‌

By:  Tupaki Desk   |   10 May 2017 8:44 AM GMT
అమ్మ వీలునామా ఆయ‌న ద‌గ్గ‌ర ఉందట‌
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ఆస్తుల విష‌యంలో మ‌రో అనూహ్య‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ్మ ఆస్తుల ల‌క్ష్యంగా ఇటీవ‌ల దాడులు - హత్య‌లు చోటుచేసుకుంటున్న ప‌రిస్థితుల్లో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని బాంబు పేల్చాడు. జయలలిత ఆస్తులకు వారసులు తాను, త‌న‌ సోదరి దీపా మాత్రమే అంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న ఇటు అన్నాడీఎంకే వ‌ర్గాలు, అటు చిన్న‌మ్మ జ‌య‌ల‌లిత‌కు చెందిన మ‌న్నార్‌ గుడి మాఫియా వ‌ర్గాలు, త‌మిళ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా విశ్లేషిస్తున్నారు.

దివంగ‌త సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసిన ఉదంతంలో వీలునామాపైనే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. కొడనాడు ఎస్టేట్ లో వీలునామాతో పాటుగా నగదు-నగల కోసం హత్య జరిగిందనే కోణంలో నీలగిరి జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇన్నాళ్లు తెర వెనుక ఉన్న దీప‌క్ తాజాగా ఆస్తుల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది. త‌మ అత్త జయలలిత రాసిన వీలునామా తన దగ్గర ఉందని, ఆమె ఆస్తులు అన్నీ నా పేరిట, నా సోదరి దీపా పేరిట రాసి ఉన్నాయని, ఆస్తులు మొత్తం మాకే చెందుతాయని సంచలన‌ ప్రకటన చేశారు. ఈ వీలునామా ప్ర‌కారం చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని బంగ్లా, చెన్నైలోని పార్సన్ మేరన్ లోని రెండు కార్యాలయాలు, సెయింట్ మేరీస్ లోని నివాసం, కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్ లోని ద్రాక్ష తోట తదితర ఆస్తులు అన్నీ మావే అంటూ దీపక్ జయకుమార్ ప్రకటించారు. జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ప్రకటనతో శశికళ వర్గంలోని మన్నార్ గుడి మాఫియా ఉలిక్కిపడింది. ఇంత కాలం జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లో మ‌కాం వేసి ఆ బంగ్లాలో హల్ చల్ చేసిన మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఇప్పుడు ఏం చేస్తారు అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాగా, జయలలిత రాసిన వీలునామా ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ దగ్గర ఉందా ? లేక కొడనాడు ఎస్టేట్ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆయనతో ఈ మాటలు శశికళ వర్గం చెప్పించిందా ? అంటూ అన్నాడీఎంకే నాయకుల్లో చర్చ మొదలైయ్యింది. అయితే తన మేనత్త ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి దీపక్ - దీపా జయకుమార్ కచ్చితంగా వస్తారని అమ్మ అభిమానులు అంటున్నారు. వారి దగ్గర వీలునామా ఉంటే చట్టపరంగా ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు దీపక్ సిద్దం అయ్యారని తెలిసింది.