Begin typing your search above and press return to search.

జేడీ కి పంచ్ వేస్తూ పవన్ కు అండగా నిలిచిన జేపీ

By:  Tupaki Desk   |   1 Feb 2020 4:30 AM GMT
జేడీ కి పంచ్ వేస్తూ పవన్ కు అండగా నిలిచిన జేపీ
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంధించిన లేఖాస్త్రం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా అందులో వ్యాఖ్యలు ఉండటం.. ఆయనలో నిలకడలేనితనాన్ని జేడీ ప్రశ్నించటాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకో లేకపోతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు సగటు రాజకీయ నేత మాదిరి బురద జల్లే తీరును పలువురు తప్పు పట్టారు. జేడీ తనపై సంధించిన విమర్శకు టైమ్లీగా స్పందించిన పవన్ కల్యాణ్.. తనకు సిమెంటు ఫ్యాక్టరీలు.. గనులు.. పాల ఫ్యాక్టరీలు లేవంటూ పలువురు అధినేతల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తాను పార్టీ నడపాలన్నా.. తనను నమ్ముకున్న వారికి ఇబ్బంది లేకుండా ఉండేలా చేయాలంటే తనకు సినిమాల్లో నటించటం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు.

పవన్ రిప్లైపై సానుకూలత వ్యక్తమైంది. రాజకీయాల్లో అనుకోనిది జరిగినప్పుడు.. డబ్బుల కోసం దందాలు చేయకుండా కష్టపడి సినిమాలు చేస్తానని చెప్పటం కూడా తప్పేనా? అన్న ప్రశ్నతో పాటు.. సినిమాల కోసం రాజకీయాల్ని వదిలేయటం లేదు కదా? కిందా మీదా పడి రెండు పనులు చేస్తున్నాడు కదా? అన్న వాదన పలువురి నోటి నుంచి వచ్చింది.

ఇలాంటి వేళలోనే పవన్ వాదనకు అండగా నిలిచారు లోక్ సత్తా అధినేత జేపీ అలియాస్ జయప్రకాష్ నారాయణ. సినిమాల్లో నటించాలన్న పవన్ నిర్ణయంలో ఏ మాత్రం తప్పు లేదన్న ఆయన.. పవన్ అనే వ్యక్తి హీరో కాబట్టి.. సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయని.. అలా చేయటం తప్పేం కాదన్నారు.

అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి.. ఇప్పుడు మేకప్ వేసుకోవటం తప్పేం కాదన్న జేపీ.. సక్రమ మార్గంలో ఆదాయాన్ని ఆర్జింటం తప్పు కాదన్నారు. నిజాయితీ గా.. గౌరవ ప్రదంగా సంపాదించుకునేటప్పుడు ఎవరికీ ఎలాంటి సంజాయిషీ ఇవ్వాల్సిన పని లేదన్నఆయన.. పవన్ తన పార్టీని కాపాడుకోవటం కోసం.. తన చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు గురించి ఆలోచించి సినిమాల్లో నటించటాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని పేర్కొన్నారు. క్లీన్ చిట్ ఉన్నజేపీ లాంటి వారి మద్దతు పవన్ కు రావటం ఆసక్తికరంగా మారింది. అన్ని అంశాల మీద స్పందించని జేపీ.. పవన్ విషయంలో ఆయన రియాక్టు అయిన తీరుకు పవన్ అభిమానులు.. జన సైనికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.