Begin typing your search above and press return to search.

ఈబీసీ రిజ‌ర్వేన్లు..జేపీ వాద‌న ఇదే

By:  Tupaki Desk   |   13 Jan 2019 2:10 PM GMT
ఈబీసీ రిజ‌ర్వేన్లు..జేపీ వాద‌న ఇదే
X
జ‌న‌ర‌ల్ కేట‌గిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) విద్య - ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు- 2019కు రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందనేది కేంద్రం తరువాత ప్రకటించనుంది. ఈ కీల‌క స‌వ‌ర‌ణ‌పై లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పందించారు.

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడం మంచిదేనని ఆయ‌న పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని - అయితే పేదరికంలో ఉన్న వాళ్లకే రిజర్వేషన్లు ఉపయోగపడాలన్నారు. తల్లిదండ్రులకు చదువులేకపోవడం - చదివిన స్కూళ్లను బట్టి.. పేదరికాన్ని నిర్ధారించి రిజర్వేషన్లు అమలు చేయాలని జేపీ అన్నారు. తహసీల్దార్‌ ఇచ్చే ధ్రువపత్రం వల్ల పేదరికం తెలియదని.. రిజర్వేషన్‌ కుదరని పక్షంలో వెయిటేజీ ఇవ్వాలని జేపీ సూచించారు. పాఠశాల విద్యలో తెలుగు రాష్ట్రాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. కేంద్రం రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో చెల్లుతాయో - లేదో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌ పెట్టారని.. ఇతర రాష్ట్రాల చట్టాలు ఇంకా పొందుపరచలేదని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఏమవుతాయో చూడాలని జేపీ అన్నారు.

రిజర్వేషన్లు సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తున్నాయని.. వాటితో కేవలం కొంతమందికే లాభం కలుగుతోందని జేపీ పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అవసరమని.. నిజమైన పేదలకు వాటిని కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కోటీశ్వ‌రులు ఉంటే, వారికి అప్ప‌టికే రిజ‌ర్వేష‌న్ అంది వారి పిల్ల‌ల‌కు సైతం అందితే దాని అర్థం ఏముంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల చ‌దువు, వారి ఆస్తిపాస్తులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రిజ‌ర్వేల‌స్‌లు క‌ల్పించాల‌న్నారు.