Begin typing your search above and press return to search.

దిశా ఉదంతం పై జయాబచ్చన్ vs రాజ్‌ నాథ్

By:  Tupaki Desk   |   2 Dec 2019 10:12 AM GMT
దిశా ఉదంతం పై జయాబచ్చన్ vs రాజ్‌ నాథ్
X
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ ఉదంతం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దిశా హత్య పై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. దిశ ఉదంతంపై పార్లమెంటులో అత్యవసర చర్చ జరుగుతోంది. రాజ్యసభలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రెండు సభలలో ప్రతి ఒక్కరు కూడా దిశా హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సభలో ఈ ఘటనపై స్పందిస్తూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ దిశా హత్యపై పార్లమెంట్ వద్ద మీడియాతో ఎంపీ జయా బచన్ మాట్లాడుతూ.. ఒకవేళ మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వాలకి చేతకాకపోతే - ప్రజలకు వదిలేయండి వారే తగిన తీర్పు ఇస్తారు. రక్షణ కల్పించని వారిని - దోషులను పబ్లిక్‌ కు అప్పగించాలి. వారికి తమ తీర్పుతో ప్రజలే శిక్ష విధిస్తారు అని - ఇటువంటి ఘటనలపై ఇదే వేదిక మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కానీ.. వాటికీ ఒక పరిష్కారం చూపలేకపోతున్నాం. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.

పలువురు ఎంపీలు గళమెత్తితేనో - మహిళలకు కేవలం చట్టాలు చేస్తేనో బాధితులకు న్యాయం జరగదు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి దారుణాలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే ఉభయ సభలలోని నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ దిశా హత్య పై వెంటనే ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి ..దోషులకు వెంటనే శిక్ష అమలు చేసేలా చేయాలని కోరారు.

ఈ దిశా ఘటనపై - గౌరవ సభ్యుల కామెంట్స్ పై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్.. మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరోధించడానికి కఠిన చట్టాలు రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు. అన్ని పార్టీలు - వర్గాలు సహకరిస్తే ఏకాభిప్రాయంతో దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావచ్చని రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అన్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను రూపొందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.