Begin typing your search above and press return to search.

ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చు.. అమర జవాన్ చివరి చాటింగ్ వైరల్

By:  Tupaki Desk   |   28 Nov 2020 7:30 AM GMT
ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చు.. అమర జవాన్ చివరి చాటింగ్ వైరల్
X
సరిహద్దుల్లో సైనిక విధులంటే ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే సరిహద్దుల్లో బందోబస్తు నిర్వహించడం అంటే ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించడమే. ఏ వైపు నుంచి ఉగ్రమూక దాడి చేస్తుందో, శత్రు దేశాలు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియని పరిస్థితుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు నిత్యం తీవ్ర ఒత్తిడిలో తమ బాధ్యతలు నెరవేర్చుతుంటారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో, జమ్ము కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట సైనికులు అమరులు అవ్వడం చూస్తూనే ఉంటాం.

తాజాగా శ్రీనగర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారిలో ఓ జవాన్ చనిపోవడానికి ఒక రోజు ముందు తన స్నేహితుడితో వాట్సాప్ లో చేసిన చాటింగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చలిగావ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ గత ఏడాది కర్ణాటకలో జరిగిన ఓ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ప్రతిభ చూపి సైనికుడిగా ఎంపికయ్యాడు. శ్రీనగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం యశ్ తన స్నేహితుడితో వాట్సప్ చాటింగ్ చేశాడు.

స్నేహితుడు కుశలప్రశ్నలు వేసి ఎలా ఉన్నావ్.. అంటూ ప్రశ్నించగా.. 'నీకు తెలియనిది ఏముంది.. ఇవాళ ఉంటాం.. రేపు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు' అని యశ్ బదులిచ్చాడు. కాగా ఆ మరుసటి రోజే ఉగ్రవాదులు జరిపిన దాడిలో యశ్ వీరమరణం పొందాడు. ఒకరోజు ముందే తన స్నేహితుడితో ఈరోజు ఉన్నా కానీ..రేపు ఉంటామోలేదో తెలియదు.. అని యశ్ అన్న మాటలు అక్షరాలా నిజమ వడంతో ఇప్పుడు ఆ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యశ్ తన మాతృభాష అయిన మరాఠి లో చాటింగ్ చేయగా.. దీన్ని చదివిన పలువురు కంటతడి పెట్టుకుంటున్నారు.

గురువారం శ్రీనగర్లో యశ్ విధులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో అక్రమంగా ఎల్వోసీ చేసి దాటి వచ్చిన ముగ్గురు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. పట్టపగలే జవాన్లపై తుపాకీ కాల్పులు జరిపారు. సైనికులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగగా ఈ కాల్పుల్లో యశ్ తో పాటు మరో జవాన్ వీర మరణం పొందారు.