Begin typing your search above and press return to search.

ఏపీతో పాటు ఆ 2 రాష్ట్రాలకు 'జవాద్' ముప్పు

By:  Tupaki Desk   |   2 Dec 2021 5:34 AM GMT
ఏపీతో పాటు ఆ 2 రాష్ట్రాలకు జవాద్ ముప్పు
X
వాన వస్తుందంటే హుషారు వస్తుంది. ఇప్పుడు ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. గడిచిన నెలలో పెద్ద ఎత్తున కురిసిన వర్షాలకు.. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చూడని సీన్లు ఎన్నో దర్శనమిస్తున్నాయి. వరదలు లాంటి మాటలు ఎరుగని కడప.. చిత్తూరు జిల్లాలు అదే పనిగా పడిన వర్షాలకు తడిచి ముద్దై.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వేలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు.. రహదారులతో సహా మౌలిక వసతులు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ వర్షాలు తాలుకు షాకుల నుంచి ఇంకా బయటపడక ముందే.. తాజాగా మరో వర్షం వార్నింగ్ ఏపీకి వచ్చేసింది.

ఇప్పటివరకు ప్రకాశం.. నెల్లూరు.. చిత్తూరు.. కడప జిల్లాలు వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైతే.. తాజాగా వస్తున్న హెచ్చరికలు విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు సమస్యలు తెచ్చి పెడతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి భారత వాతావరణ శాఖ జవాద్ పేరును డిసైడ్ చేసింది. ఈ తుపాను ప్రభావంతో ఏపీ.. ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు.

డిసెంబరు 4 నుంచి తుపాను ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని వల్ల పంటలకు భారీ నష్టం కలిగించొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోమూడు రాష్ట్రాల్ని వానదేవుడు ఏం చేయబోతున్నాడన్నది ప్రశ్నగా మారింది. వరుస వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ సర్కారుకు.. జవాద్ ఎలాంటి సవాళ్లను విసురుతుందన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.