Begin typing your search above and press return to search.

26/11 ఉగ్రవాదులు మీదగ్గర స్వేచ్ఛగా ఉన్నారు.. పాక్ గడ్డపై భారతీయుడి నిప్పులు

By:  Tupaki Desk   |   21 Feb 2023 3:30 PM GMT
26/11 ఉగ్రవాదులు మీదగ్గర స్వేచ్ఛగా ఉన్నారు.. పాక్ గడ్డపై భారతీయుడి నిప్పులు
X
శత్రు దేశానికి వెళ్లాల్సి రావడమే కొంత ఇబ్బందికరం. అక్కడ సత్కారాలు పొందడం ఇంకొంత సమస్యాత్మకం.. ఎవరినుంచి విమర్శలు వస్తాయో.. ఎవరు ఏమంటారో తెలియని పరిస్థితి. అసలు శత్రు దేశంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని అయోమయంలో ఉంటాం. అలాంటిచోట.. అందులోనూ అత్యంత క్రూరమైన ఘటనపై.. అత్యంత నిర్భయంగా గళమెత్తితే.. శత్రు దేశ భూభాగంలో ఉంటూ.. ఆ దేశం తీరును ఎండగడితే ఎలా ఉంటుంది...? ఆ దేశానికి కడుపు మండిపోతుంది.. మన దేశ ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఇలాంటి పనిచేసింది.. సాదాసీదా వ్యక్తి కూడా కాదు. పలు రంగాల్లో ప్రఖ్యాతుడైన వ్యక్తి. ఇంతటి సాహసానికి ఒడిగట్టింది జావేద్ అక్తర్.. పరిచయం అక్కర్లేని పేరు ఈయనది. ప్రఖ్యాత కవి. సినీ రచయిత. స్ర్కీన్ ప్లే రైటర్. రాజ్య సభ మాజీ సభ్యుడు. పద్మ భూషణ్ (2007) గ్రహీత. ప్రఖ్యాత నటి షబానా అజ్మీ భర్త. ఇద్దరూ ఇద్దరే. జావేద్ అయిదు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ (1999) అందుకున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పుట్టి.. బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసిన ఘనత ఆయన సొంతం. దేశమంటే భక్తి. ప్రసిద్ధ నటుడు, నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కు జావేద్ అక్తర్ తండ్రి.

ఇంతకూ ఏం జరిగింది..?

26/11 దాడుల ఘటన భారతీయులెవరూ మర్చిపోలేని దారుణం. 2008లో జరిగిన ఈ ఉన్మాద దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మాస్టర్ మైండ్స్ దర్శకత్వం వహించాయి. పాక్ నుంచి బోట్ల ద్వారా ముంబై తీరానికి చేరుకున్న ఉగ్రవాదులు మన ఆర్థిక రాజధానిలో విధ్వంసం రేపారు. దాదాపు 166 మందిని బలిగొన్నారు.

తాజ్ హోటల్ సహా పలుచోట్ల దాడులకు తెగబడి ప్రాణాలను బలిగొన్నారు. పాక్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.

ఆ ముష్కరులు మీ దగ్గరే ఉన్నారు..

తన కార్యక్షేత్రం ముంబైపై జరిగిన దాడిని ఈ బాలీవుడ్ ప్రతిభాశాలి ఇంకా మర్చిపోలేదు. అందుకనే నాటి ఘటనపై పాక్ హస్తాన్ని జావేద్ అక్తర్ ఎండగట్టారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అదికూడా వారి గడ్డపైనే కావడం విశేషం. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ స్మారకార్థం ఇటీవల లాహోర్‌లో ఫైజ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. దీనికి జావెద్‌ అక్తర్‌ వెళ్లారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించారు. అయితే, విలేకరులతో మాట్లాడుతూ భారత్‌-పాక్‌ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు.

''ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. వాటిని తగ్గించాల్సిన అవసరముంది. మేం ముంబయి (Mumbai)కి చెందిన వాళ్లం. మా నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో మా కళ్లారా చూశాం. వారు(ముష్కరులు) నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదు. వాళ్లు ఇంకా మీ దేశంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్‌ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు'' అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో భారత కళాకారులను పాక్‌ గౌరవించకపోవడాన్ని తప్పుబట్టారు. ''నుశ్రత్‌ ఫతే అలీ ఖాన్‌, మెహదీ హసన్‌ లాంటి పాక్‌ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్‌ కోసం పాక్‌ ఎప్పుడైనా ఫంక్షన్‌ ఏర్పాటు చేసిందా?'' అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.