Begin typing your search above and press return to search.

విశాఖపట్నంలో జపాన్ దిగ్గజ కంపెనీ టైర్ల ప్లాంట్

By:  Tupaki Desk   |   14 Sep 2020 8:50 AM GMT
విశాఖపట్నంలో జపాన్ దిగ్గజ కంపెనీ టైర్ల ప్లాంట్
X
ఆంధ్రప్రదేశ్‌లో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. రూ.1,200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన పెద్ద కంపెనీ యోకోహమా సిద్ధమైంది. యోకోహమా గ్రూప్‌లోని ఏటీజీ టైర్ల సంస్థ నవ్యాంధ్ర పాలనా రాజధాని విశాఖపట్నంలో రూ.1,240 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడి పోర్ట్ సమీపంలోని అచ్యుతాపురం ఇండస్ట్రియల్ పార్క్‌లోని స్పెషల్ ప్రాజెక్ట్ జోన్‌‍లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిని 2023 తొలి క్వార్టర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది.

ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 55 టన్నుల రబ్బర్ వెయిట్, ఏడాదికి 20వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్నారు. విశాఖపట్నంలో ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా 600 ఉద్యోగాలు రానున్నాయి. ఇక్కడ ఏటీజీ ఆఫ్-హైవే బ్రాండ్ టైర్లను తయారు చేయనున్నారు. దేశంలో ఇప్పటికే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు ప్లాంట్స్ ఉన్నాయి. మూడో ప్లాంట్‌ను ఇప్పుడు ఏపీలో నిర్మిస్తున్నారు.

మూడో ప్లాంట్ అనువైనప్రదేశం కోసం చూస్తున్నామని, విశాఖపట్నంను ఎంచుకున్నామని యోకోహమా ఇండియా చైర్మన్, ATG డైరెక్టర్ నితిన్ మంత్రి అన్నారు. విశాఖ ప్లాంట్‌ను కేవలం ఆఫ్-హైవే బ్రాండ్ టైర్లకే పరిమితం చేస్తామని, ప్యాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్ తయారీ ఇక్కడ ఉండదని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే ఉన్న రెండు ప్లాంట్‌లలో 5,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు విశాఖలో కొత్త ప్లాంట్ నిర్మాణం ద్వారా మరో 600 ఉద్యోగాలు పెరగనున్నాయి.