Begin typing your search above and press return to search.

ఎక్క‌డో కాదు మ‌న ద‌గ్గ‌రే ఎక‌రం రూ.746 కోట్లు!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:56 AM GMT
ఎక్క‌డో కాదు మ‌న ద‌గ్గ‌రే ఎక‌రం రూ.746 కోట్లు!
X
క‌నివిని ఎరుగ‌ని ధ‌ర‌. క‌ల‌లో కూడా ఊహించ‌నంత ఎక్కువ ధ‌ర‌కు ఎక‌రం భూమిని కొనుగోలు చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎక‌రం రూ.10 కోట్లు.. రూ.50 కోట్లు.. చాలా అరుదైన సంద‌ర్భాల్లో రూ.100 కోట్ల‌కు పైనే అమ్ముడైంది చూశాం. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏకంగా ఎక‌రం రూ.746 కోట్ల‌కు అమ్ముడైన ఉదంతం తొలిసారి భార‌త రియ‌ల్ ఎస్టేట్ చ‌రిత్ర‌లో న‌మోదైంది.

ఇంత‌కీ ఇంత భారీ ధ‌ర ఎక్క‌డ ప‌లికింది? అంత ధ‌ర పెట్టి ఎవ‌రు కొన్నారు? అన్న విష‌యాల్లోకి వెళితే.. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మూడు ఎక‌రాల భూమిని మొత్తంగా రూ.2238 కోట్లు ఖ‌ర్చు చేసి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. జ‌పాన్ కు చెందిన సుమిటోమో కంపెనీ ఈ డీల్ ను ఓకే చేసింది.

ఈ డీల్ ను కాస్త బ్రేక్ చేస్తే ఎక‌రం రూ.746 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లుగా చెప్పాలి. రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికి ఈ భూమి ఎక్క‌డో కాదు ముంబ‌యి వాణిజ్య ప్రాంత‌మైన బీకేసీలోని రిల‌య‌న్స్ జియో గార్డెన్ ప‌క్క‌నే ఉంది. ముంబ‌యి మెట్రోపాలిట‌న్ రీజిన‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ ఆథారిటీ ఈ స్థలాన్ని అమ్మేందుకు కొన్ని నెల‌ల క్రితం బిడ్డింగ్ నిర్వ‌హించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. దేశీయ కంపెనీ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా బిడ్ వేయ‌టానికి ముందుకు రాలేదు. అందుకు భిన్నంగా జ‌పాన్ కు చెందిన సుమిటోమో ఒక్క‌టే బిడ్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి బిడ్ ప్రాసెస్ లో ఉంద‌ని.. అన్ని అనుమ‌తులు ల‌భించిన త‌ర్వాత స్థ‌లాన్ని కంపెనీకి కేటాయిస్తామంటున్నారు. ఇంత భారీ ధ‌ర వాస్త‌వంగా లేద‌ని.. చాలా ఎక్కువ ధ‌ర పెట్టి జ‌పాన్ కంపెనీ కొనుగోలు చేసిన‌ట్లుగా రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. జ‌పానోడు అంత తేలిగ్గా ఖ‌ర్చు చేస్తాడా? ఏం లెక్క‌లేసుకొని రంగంలోకి దిగాడో? లేదంటే.. త‌ప్పుడు లెక్క‌తో తొంద‌ర‌ప‌డి కొని అడ్డంగా బుక్ అయ్యాడా? తాజాగా సంచ‌ల‌నంగా మారిన ఈ కొనుగోలు త‌ర్వాతి ద‌శ‌ల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.