Begin typing your search above and press return to search.

చైనాకి భారీ షాక్ ఇచ్చిన జపాన్.. ఆ జాబితాలో భారత్ కి చోటు !

By:  Tupaki Desk   |   5 Sep 2020 11:50 AM GMT
చైనాకి భారీ షాక్ ఇచ్చిన జపాన్..  ఆ జాబితాలో భారత్ కి చోటు !
X
చైనా నుండి వెనక్కి వచ్చే జపాన్ పారిశ్రామిక సంస్థలకు అందజేసే రాయితీల అర్హత సాధించిన ఆసియా దేశాల జాబితాలో భారత్, బంగ్లాదేశ్ ‌లను చేర్చుతామని జపాన్ ప్రకటించింది. భారత్, జపాన్ శిఖరాగ్ర సమావేశానికి వారం ముందే, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేయడం విశేషం. చైనాపై ఆధారపడటం మానేయాలని భారత్ , ఆస్ట్రేలియా, జపాన్ ‌లు సెప్టెంబర్ 1న సప్లై చైన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మోదీ, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే సెప్టెంబరు 10న వర్చువల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఇరు దేశాల మధ్య రక్షణ, లాజిస్టిక్ సేవల పరస్పర సహకారానికి సంబంధించిన అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్‌ పై సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆస్ట్రేలియాతో జూన్ ‌లో భారత్ ఇటువంటి ఒప్పందం చేసుకుంది. చైనాతో భారత్, జపాన్ ‌ల మధ్య వేర్వేరుగా వివాదాల కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి, అదే రోజు రష్యాలో జరిగే షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జయ శంకర్ హాజరు కాబోతున్నారు. చైనా మంత్రి వాంగ్ యీని కూడా కలుస్తారని భావిస్తున్నారు.

ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మూడు దేశాల సమన్వయం కోసం జపాన్‌ వాణిజ్య మంత్రి హిరోషి కాజియామా, భారత్‌ తరపున పీయూష్‌ గోయల్‌, ఆస్ట్రేలియా తరపున సైమన్‌ బిర్మంగమ్ నాలుగు రోజుల కిందట వీడియో కాన్పరెన్స్ ‌లో మాట్లాడారు. ధరల అస్థిరతను క్రమబద్దీకరించడం సహా ఇన్ ‌పుట్‌ సరఫరాతో కలిగే నష్టాలను నిర్వహించడానికి సప్లయ్ ఛైన్ వైవిధ్యీకరణ కీలకం. విశ్వసనీయ, దీర్ఘకాలిక సరఫరా, తగిన సామర్ధ్యాల నెట్ ‌వర్క్ ‌ను సృష్టించడం ద్వారా ఈ ప్రాంతంలో సప్లయ్ ఛైన్‌ ను అనుసంధానించడానికి మేము ప్రధాన మార్గాన్ని అందించగలం అని పియూష్ గోయల్ చెప్పారు.