Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కారుకు సంక‌టంగా మారిన జ‌న‌వ‌రి 26.. బిగిస్తున్న అన్న‌దాత పిడికిలి!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:34 AM GMT
మోడీ స‌ర్కారుకు సంక‌టంగా మారిన జ‌న‌వ‌రి 26.. బిగిస్తున్న అన్న‌దాత పిడికిలి!
X
రైతుల కోస‌మే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశామ‌ని చెప్పుకొంటున్న న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు జ‌న‌వ‌రి 26 టెన్ష‌న్ పెరుగుతోంది. స‌ద‌రు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతున్న అన్న‌దాత‌లు.. ఈ విష‌యంలో పైపై ఉప‌శ‌మ‌నాల‌కు తాము సిద్ధంగా లేమ‌ని స్ప‌స్టం చేస్తున్నారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో త‌మ ఉద్య‌మా న్ని మ‌రింత తీవ్ర త‌రం చేసేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ జ‌న‌వ‌రి 26న దేశ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రింతగా త‌మ ఉద్య‌మాన్ని వేడెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఇది కేవ‌లం ఢిల్లీలో పంజాబ్ రైతులు చేస్తున్న ఉద్య‌మంతో స‌రిపెట్ట‌డం లేదు. వారికి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజు 20 వేల ట్రాక్ట‌ర్ల‌తో ఢిల్లీలో భారీ ర్యాలీకి రైతులు సిద్ధ‌మ‌య్యారు. సుప్రీం కోర్టు సూచ‌న‌ల మేర‌కు ఢిల్లీ పోలీసులు ఈ ర్యాలీకి అనుమ‌తులు ఇచ్చారు. ఢిల్లీ రింగ్ రోడ్డులో ఈ యాత్ర చేసుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పు డు ఢిల్లీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ రైతులు కూడా ర్యాలీల‌కు సిద్ధ‌మ‌య్యా రు. ఎవ‌రికి తోచిన మార్గంలో వారు ఉద్య‌మానికి ఉద్యుక్తుల‌వుతున్నారు. రైతులకు మద్దతుగా మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు ఏకమయ్యారు. చిన్నచిన్న రైతు సంఘాలన్నీ కలిసి ‘ఆల్ ఇండియా కిసాన్ సభ’ పేరుతో ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని వేలాదిమంది రైతులు ర్యాలీగా 180 కిలోమీటర్ల దూరంలోని ముంబైకి బయలుదేరారు.

లక్షలాదిమంది రైతులు బ్యానర్లు, జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ముంబైకి తరలివస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర రైతులు చేస్తున్న ఈ పాద‌యాత్ర‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌కలోని అన్ని జిల్లాల రైతులు కూడా జ‌న‌వ‌రి 26న రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల ట్రాక్ట‌ర్ల‌తో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. పంజాబ్ రైతుల‌కు మ‌ద్ద‌తుగా తాము కూడా క‌దం తొక్కుతామ‌ని ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చారు. వీరికి గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు మ‌ధ్యాహ్నం నుంచి ర్యాలీ చేసుకునేందుకు పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. త‌మిళ‌నాడు రైతులు చెన్నైలో భారీ బ‌హిరంగ స‌భ‌కు రెడీ అయ్యారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రైతులు కూడా ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. వీరికి ఇంకా అనుమ‌తులు రావాల్సి ఉంది. ఇక‌, తెలంగాణ రైతాంగం చ‌ర్చ‌ల్లో ఉంది. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా.. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తుల విష‌యంలో ఎలాంటి ప‌రిణామం ఉంటుందోన‌ని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇలా మొత్తంగా మోడీ స‌ర్కారుకు దేశ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 26న భారీ సెగ త‌గ‌ల‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.