Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌పై వేటు ప‌డ‌నుందా?

By:  Tupaki Desk   |   28 Sep 2017 11:39 AM GMT
క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌పై వేటు ప‌డ‌నుందా?
X
తెలంగాణ‌లో ప్ర‌జాప్ర‌తినిధులు - ప్ర‌భుత్వాధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపంతో వివాదాలు రేగుతున్నాయి. ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతో క‌లెక్ట‌ర్ల‌పై ఎమ్మెల్యేలు అధికారాన్ని చ‌లాయిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి - జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన మధ్య ఏర్ప‌డ్డ వివాదం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. బతుకమ్మకుంటలో కొద్ది భూమిని క‌బ్జా చేశార‌ని ముత్తిరెడ్డిపై ఆరోప‌ణలున్నాయి.

అయితే క‌బ్జా అయిన స్థలం యాద‌గిరి రెడ్డి పేరు మీద కాకుండా వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. అందులోనూ ఆ భూమి వేరే స‌ర్వే నంబర్‌లో ఉండటంతో యాద‌గిరి రెడ్డి ఈ వ్య‌వ‌హారం లో నుంచి బ‌య‌ట‌పడే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

కలెక్టర్‌ దేవసేన త‌న‌పై చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ కు వివరణ ఇచ్చేందుకు యాద‌గిరి రెడ్డి విఫ‌ల‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న సీఎస్ ఎస్పీ సింగ్‌ ను కలిసి పూర్తి వివరాల వెల్లడించి - సీఎం పీఆర్వో ద్వారా కేసీఆర్‌ కు త‌న వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.కలెక్టర్‌ తనపై అసత్య ఆరోపణలు చేశార‌ని, ఎమ్మెల్యేలను కలుపుకుపోవడం లేదని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. బ‌తుక‌మ్మ‌కుంట‌లో దుర్గమ్మగుడి నిర్మాణంలో ట్రస్ట్‌ ఏర్పాటు చేయడానికి కారణాలు అఖిలపక్ష పార్టీల ఏకాభిప్రాయం రిజిస్ట్రేషన్‌ తీర్మానాలను చూపినట్టు సమాచారం. ఒక్క గుంట భూమి తన పేర ఉన్నా రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ప్రజాప్రతినిధుల్ని కలుపుకుపోనందున దేవ‌సేన ను బదిలీ చేయాలని కూడా కోరినట్టు సమాచారం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలికి స్థానిక ఎమ్మెల్యేతో గొడవ ఉంది. దీంతో, నెలక్రితమే వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలిని జనగామకు - శ్రీ దేవసేనను వరంగల్‌ కు బదిలీ చేయాలని కడియం శ్రీహరి....ఎస్పీ సింగ్ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే, స్థానిక ఎమ్మెల్యేలను కలుపుకుపోని కలెక్టర్లను బదిలీ చేయడం టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వానికి కొత్తేమీకాదు. గతంలో పెద్దపల్లి కలెక్టర్‌ ను ఇదే త‌ర‌హాలో బదిలీ చేయగా - కరీంనగర్‌ కలెక్టర్‌ విషయంలోనూ కేసీఆర్ రంగంలోకి వ‌చ్చారు. అయితే,స‌మ‌స్య‌ల ప‌ట్ల వెంట‌నే స్పందిస్తార‌ని దేవ‌సేన‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. దీంతో, ప్రభుత్వం.... కలెక్టర్‌ పై బదిలీ వేటువేస్తే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో పాటు ఐఏఎస్‌లు ఒక్కటయ్యే అవకాశం ఉంది. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం ...దేవ‌సేన విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంటను మినీ ట్యాంకు బండ్ గా మారుస్తున్నారు. రూ. 30 లక్షల విరాళాల సేకరణలోనూ అవకతవకలు జరిగాయనే విమర్శలున్నాయి. కుంట డెవ‌ల‌ప్ మెంట్ కు నిబంధనలు పరిశీలింకుండానే అనుమ‌తివ్వాల‌ని అధికారులతో యాద‌గిరి రెడ్డి గొడవకు దిగారు. విరాళాలు - ప్రభుత్వ నిధులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం 2015లోనే పూర్తయింది. మినీ ట్యాంక్ బండ్ ఆవరణలోనే 2000 గజాల్లో దుర్గమ్మ దేవాలయం నిర్మించారు. ఇందుకోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి 1.5 ఎకరాల భూమి సేకరించారు. ఎమ్మెల్యే గుడిపేరుతో చెరువు శిఖాన్ని ఆక్రమించారని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రెండోవిడ‌త‌ నిధులను మంజూరు చేయలేదు. మినీట్యాంక్‌ బండ్ నిర్మాణం పనుల్లో అవకతవకలు జరిగాయని - శిఖం భూమిలో గుడిని నిర్మించడమే కాక కుంటను పూడ్చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని కలెక్టర్‌ శ్రీదేవసేన తేల్చిచెప్పారు. అంతే కాకుండా మినీ ట్యాంకు బండు వద్ద ఈసారి బతుకమ్మ వేడుకలు జరపబోమని - మరో ప్రాంతంలో సంబరాలు చేస్తామని కలెక్టర్‌ తేల్చిచెప్పడంతో ఈ వివాదం వేడెక్కింది.