Begin typing your search above and press return to search.

మ‌హిళా క‌లెక్ట‌ర్లు వ‌ర్సెస్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   27 Sep 2017 6:55 AM GMT
మ‌హిళా క‌లెక్ట‌ర్లు వ‌ర్సెస్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు!
X
తెలంగాణ‌లో ఇటీవ‌ల కాలంలో అధికార టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నారు. జిల్లాకు ప్ర‌భుత్వం త‌ర‌పును సుప్రీంగా భావించే క‌లెక్ట‌ర్ల‌తో గొడ‌వలు పెట్టుకుంటూ బ‌జారుకెక్కుతున్నారు. ముఖ్యంగా మ‌హిళా క‌లెక్ట‌ర్ల‌తోనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు వివాదాలు త‌లెత్తుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఒక బ‌హిరంగ స‌భ‌లో మ‌హబూబాబాద్ క‌లెక్ట‌ర్ ప్రీతి మీనా చేతిని త‌న చేతిలోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు అక్క‌డి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్. ఆయ‌న చేతిని విసిరికొట్టిన క‌లెక్ట‌ర్ ఆయ‌నపై కేసు న‌మోదు చేయాలంటూ స్వ‌యంగా ఎస్పీని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. మీడియా కూడా దీన్ని పెద్ద హైలెట్ చేయ‌డంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. పిచ్చి వేషాలు వేస్తే పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తానంటూ శంక‌ర్ నాయ‌క్ ను హెచ్చ‌రించ‌డంతోపాటు క‌లెక్ట‌ర్ ను క్ష‌మాప‌ణ అడ‌గాల‌ని ఆదేశించారు. దీంతో కలెక్ట‌ర్ త‌న సోద‌రి లాంటిద‌ని, పొర‌పాటున చేయి తాకింద‌ని చెప్పుకొచ్చారు శంక‌ర్ నాయ‌క్‌. ఆమె బాధ‌ప‌డి ఉంటే క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని అన‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

తాజాగా మ‌ళ్లీ ఇదే కోవ‌లో పున‌ర్విభ‌జ‌న‌లో వ‌రంగ‌ల్ నుంచి వేరుపడ్డ జ‌న‌గాం జిల్లాకు క‌లెక్ట‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ దేవ‌సేన - స్థానిక టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిల‌ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలను ఇంత కాలం ఓపిక పట్టానని, ఇకపై ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌ వ్యవహరిస్తున్నారు. తాజాగా బతుకమ్మ కుంట వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి మీడియా సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదెకరాల కుంటను పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్ దేవసేన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వ్యవహరించినట్టు దేవసేన చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని కలెక్ట‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని ఆమె చెప్పారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారంట. అయినా సరే! పెద్దగా చర్యలేవీ లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి మీడియాకు వెల్లడించినట్లు స‌మాచారం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. కాగా కొన్నిరోజుల క్రితం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీయగా, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఎంపీ బూరనర్సయ్య గౌడ్ జోక్యం చేసుకోవటంతో ఇరువురు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.