Begin typing your search above and press return to search.

తిరుపతిలో బీజేపీ తరుఫున ప్రచారానికి దూరంగా జనసైనికులు?

By:  Tupaki Desk   |   14 March 2021 4:30 AM GMT
తిరుపతిలో బీజేపీ తరుఫున ప్రచారానికి దూరంగా జనసైనికులు?
X
తిరుపతి సీటు బీజేపీ-జనసేనల మధ్య చిచ్చు పెడుతోంది. అధిష్టానవర్గాలు ఒప్పుకున్నా.. క్షేత్రస్థాయి వర్గాలు మాత్రం జీర్ణించుకోవడం లేదు. పంచాయతీలో గెలిచిన ఊపును కంటిన్యూ చేద్దామనుకున్న జనసైనికుల ఆశలపై జనసేనాని పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లేశారు. తిరుపతి సీటును బీజేపీకి ఇచ్చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయి.. విశాఖ ఉక్కుతో సెగ తగులుతున్న బీజేపీకి ఈ సీటు ఇవ్వడం వృథా అని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఏపీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న బీజేపీకి ఓటమి తప్పదంటున్నారు. ఈ క్రమంలోనే తమకు సీటు వస్తుందని.. గెలుపు కోసం ఆరాటపడిన జనసేన నేతలంతా ఇప్పుడు ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి.

తిరుపతి పార్లమెంటరీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో తమ పార్టీ తరుఫున అభ్యర్థిని నిలబెట్టకూడదని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.., బదులుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జనసేన కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బిజెపి వాగ్దానం చేసిందని.. అందుకే సీటు నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నామని పవన్ ఇచ్చిన వివరణ పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం లేదు. కనీసం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎటువంటి తిరుగుబాటు జరగనప్పటికీ సోషల్ మీడియాలో పవన్‌పై చాలా ట్రోలింగ్ ఉంది.

తిరుపతి ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి తరఫున జనసేన పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయరని.. ఈ మేరకు వాళ్లంతా ఫిక్స్ అయ్యారని అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో వారు పూర్తిగా నిరాశగా ఉన్నారని.. బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి ఆసక్తిగా లేరని అంటున్నారు”అని ఒక పార్టీ నాయకుడు అన్నారు.

పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థి కోసం విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటారో లేదోనని జనసేన శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. “పవన్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. బహుశా, అమిత్ షా లేదా నడ్డా వంటి అగ్ర బిజెపి నాయకులు ప్రచారం కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, తిరుపతి ఉప ఎన్నికలలో జనసేన లేదా బిజెపి పెద్దగా నిలబడవని తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ పవనాలు వీయడంలేదు. "టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీలు తిరుపతి పరిధిలో దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడే ముగిసిన మునిసిపల్ ఎన్నికలలో వారు ఎటువంటి పోటీ చేయలేదు. వారు మునిసిపాలిటీలను కూడా గెలవలేనప్పుడు, తిరుపతి పార్లమెంటు స్థానాన్ని ఎలా గెలుస్తారని వైసీపీ శ్రేణులు అంచనావేస్తున్నాయి.