Begin typing your search above and press return to search.

'శాస‌నం' స‌రే.. సాధ‌నేది ప‌వ‌న్ జీ!

By:  Tupaki Desk   |   31 Oct 2022 6:30 AM GMT
శాస‌నం స‌రే.. సాధ‌నేది ప‌వ‌న్ జీ!
X
జ‌న‌సేన అంటే అభిమానం ఉన్న‌వారు కూడా ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. తాజాగా జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో మంగ‌ళ‌గిరిలో భేటీ అయ్యారు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై రెండు రోజుల పాటు చ‌ర్చ పెట్టారు.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ మాట్లాడుతూ..(మీడియాతో కాదు) 2024లో జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. ఇది శాస‌నం! అని వ్యాఖ్యానించారు. దీనికి కార్య‌క‌ర్త‌లు ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో మోత‌మోగించారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో .. ఫ‌స్ట్ సీన్‌కు వ‌చ్చినంత ఉత్సాహం వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ప్ర‌సంగం అయిపోయింది. మ‌రి ప‌వ‌న్ ఏం చెప్పారు? అంటే.. ఒక‌రి మొహం ఒక‌రు చూసుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డ‌మే ధ్యేయంగా జ‌న‌సేన ముందుకు వెళ్తుంద‌ని చెప్పిన ప‌వ‌న్, దీనికి అనుస‌రించే మార్గం ఏంట‌నేది మాత్రం చెప్ప లేక పోయింది. పోనీ ఇది మీడియా స‌మావేశం కాదు క‌దా చెప్ప‌క‌పోవ‌డానికి , కార్య‌క‌ర్త‌ల స‌మావేశం, పైగా జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌మావేశం.

దీనిలోనే క‌దా, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చేయాలి? అనే విష‌యాల‌పై కూలంక‌షంగా చ‌ర్చించుకుని నాయ‌కుల‌ను ముందుకు న‌డిపించేది. కానీ, ప‌వ‌న్ ఈ కర్ర‌ను వ‌దిలేసి శాస‌నాల‌పై సాము చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. క్యాడ‌ర్ లేని పార్టీ ఏదైనా ఉంటే అది జ‌న‌సేనే.

ఈ విష‌యంలోఎవ‌రికీ ఎలంటి మొహ‌మాటం లేదు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయాలి. స‌భ్య‌త్వాలు న‌మోదు చేయాలి. ముఖ్యంగా బూత్ స్థాయిలో బ‌లమైన వారిని నియ‌మించాలి. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఏపీ స‌మ‌రం ఠారెత్త‌నుంది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలి. ఇవ‌న్నీ ఇలా ఉంటే, గ్రామ‌స్థాయిలో పార్టీని ప‌టిష్ఠం చేయ‌డం మ‌రింత కీలకం. గత ఎన్నిక‌ల‌ను తీసుకుంటే గ్రామీణ స్థాయిలోనే ఎక్కువ‌గా ఓట్లు న‌మోద‌య్యాయి. ఇక్క‌డ ఓటింగ్ శాతం 64 ఉంటే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో 52శాతం ఉంది.

దీనిని బ‌ట్టి గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌సేన పుంజుకోవాలి. మ‌రి ఈ దిశ‌గా ప‌వ‌న్ ఏదైనా ప్లాన్ చేశారా? అంటే లేదు. కేవ‌లం ఆయ‌న చెప్పింది ఏంటంటే.. ''వైసీపీ నేత‌ల‌పై తిర‌గ‌బడండి. నేను చూసుకుంటాను!'' అనే. అంతేకాదు, ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వ విధానాల్లోని లోపాల‌ను ఎత్తి చూపాల‌న్నారు. మంచిదే అయితే, అస‌లు ఇన్ని చేసినారేపు ప‌వ‌న్ చేసిన శాస‌నం అమ‌లు కావాలంటే బ‌ల‌మైన కేడ‌ర్ ఉండాలిక‌దా! కానీ, ఇవేవీ లేకుండా ప‌వ‌న్ ఏం చేసినా ప్ర‌యోజ‌నం ఏంటి? అనేది జ‌న‌సేన‌లోనే గుస‌గుస వినిపిస్తోంది. ఇక‌, ప‌వ‌న్ చేస్తాన‌ని , త‌ర్వాత‌వాయిదా వేసిన బ‌స్సు యాత్ర పైనా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఇది కూడా జ‌న‌సేన నాయ‌కుల‌కు వెలితిగానే అనిపించ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.