Begin typing your search above and press return to search.

ఏపీలో ఇద్దరు మిత్రుల జర్నీ ముగిసినట్లేనా? ఎవరికి వారేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:30 PM GMT
ఏపీలో ఇద్దరు మిత్రుల జర్నీ ముగిసినట్లేనా? ఎవరికి వారేనా?
X
అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ.. ఏపీలో బీజేపీ.. జనసేన మధ్య నడుస్తున్న మిత్రత్వం ముగింపు దశకు వచ్చినట్లుగా చెబుతున్నారు. గడిచిన రెండేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య మిత్రత్వం ఉన్నప్పటికీ.. వారి మధ్యన సరైన అవగాహన లేకపోవటం.. ఒకరి ప్రయోజనాల్ని మరొకరు అర్థం చేసుకోవటంలో విఫలం కావటమే కాదు.. తమ బలాన్ని బలహీనతగా అభివర్ణిస్తున్న బీజేపీ తీరును జనసేన అధినేత పవన్ కు మింగుడుపడటం లేదంటున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరిపై పవన్ గుర్రుగా ఉన్నప్పటికి స్నేహధర్మాన్ని పాటించి.. మిత్రత్వాన్నికంటిన్యూ చేస్తున్నారని.. రానున్న రోజుల్లో తెగ తెంపులు ఖాయమన్న మాట వినిపిస్తోంది.

జనసేన అధినేత తీరుకు తగ్గట్లే బీజేపీకి చెందిన ముఖ్యనేతలు సైతం పవన్ పార్టీ విషయంలో ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని పట్టించుకోవటం లేదు.. అంది వచ్చిన అవకాశాల్ని వదిలేస్తున్న జనసేన తీరును బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. ఇటీవల టిప్పు సుల్తాన్.. గోవధ లాంటి అంశాల్లో వైసీపీని ఇరుకున పెట్టేందుకు అవకాశాలు ఉన్నప్పటికి తమ వినతుల్ని జనసేన సరైన రీతిలో స్పందించలేదని చెబుతున్నారు. ఇలానే సాగితే.. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటం కుదరదన్న మాట వినిపిస్తోంది. అందుకే.. జనసేనతో తెగతెంపులు చేసుకొని ఒంటరి పోరుకుసిద్ధం కావటం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీ అధినాయకత్వం తీరుపై జనసేన ఆగ్రహంగా ఉందంటున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రయోజనాల్ని మోడీ సర్కారు అస్సలు పట్టించుకోవటం లేదన్న ఆలోచనలో జనసేన చీఫ్ ఉన్నట్లు చెబుతున్నారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ప్రజల్లో బీజేపీ పై ఆగ్రహం అంతకంతకూ ఎక్కువ అవుతోందని.. ఆ పార్టీతో కలిసి ఉంటే తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

తమకు బలం ఉన్నప్పటికి తమను పోటీ చేయకుండా అడ్డుపడి.. తమ మద్దతుతో బీజేపీ పోటీ చేయటాన్ని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి బరిలోకి దిగితే పరిస్థితి మరోలా ఉండేదని.. గెలుపు సాధ్యం కాకున్నా.. ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో బీజేపీతో వీలైనంత దూరంగా ఉండేందుకు వీలుగా.. బీజేపీ చేసే పోరాటాలకు పవన్ బ్యాచ్ దూరంగా ఉంటున్నారు. దీనిపై బీజేపీ ఇప్పటికే అధినాయకత్వానికి సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో రాజకీయంగా బలీయంగా మారాలంటే బీజేపీతో చేస్తున్న మిత్రత్వం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. టీడీపీతో జత కట్టటం మంచిదన్నయోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ద్వారా.. ప్రభుత్వ ఏర్పాటులోకీలకభూమిక పోషించామన్న క్రెడిట్ సొంతమైనప్పటికీ.. తమ అభ్యర్థులు ఎవరు లేకపోవటంతో జనసేన తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. అందుకే.. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీతో కంటే టీడీపీతోనే కలిసి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఇదంతా జరగటానికి మరింత సమయం పడుతుందని.. ఇప్పటికిప్పుడే జరగదంటున్నారు. ఏది ఏమైనా.. బీజేపీ.. జనసేనల మధ్య జర్నీ చివరకు వచ్చిందని.. ఇక ఎవరి దారి వారిదేనన్న అధికార ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తమ ప్రత్యర్థుల్ని వదిలేసి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సింది లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.