Begin typing your search above and press return to search.

జనసేనలో పెరుగుతున్న జోష్..ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువలో

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:31 AM GMT
జనసేనలో పెరుగుతున్న జోష్..ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువలో
X
2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న జనసేన ఆ తరువాత మిగతా పార్టీల్లగా కామ్ గా ఉండలేదు. ప్రజల తరుపున పోరాటం చేస్తూ నిత్యం వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకొని వాటిపై పోరాటం చేస్తూ పార్టీ పటిష్టతను పెంచుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాల్లో బిజీగా మారుతూనే మరోవైపు పొలిటికల్ గా స్టాండెడ్ లీడర్ గా తయారవుతున్నాడు. ఇటీవల ఆయన పొలిటికల్ గా దూకుడు పెంచడంతో చాలా మంది జనసేన వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ లోపాలను బయటపెడుతూ ప్రజల తరుపున ప్రశ్నించడంతో కొంత మంది జనసేన చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. తాజాగా నిర్వహించిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ పార్టీ తరుపున పోటీ చేయకపోవడంతో పాటు ఆ తరువాత తిరిగి సినిమాల వైపే వెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో ఏపీ టీడీపీ-బీజేపీ తరుపున ప్రచారం చేశారు. అప్పట్లో పవన్ ప్రసంగానికి జనం ఆకర్షితులయ్యారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమయ్యారు. అయితే కొన్ని రోజుల తరువాత టీడీపీ నాయకులు పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. ఆ తరువాత సొంతంగా జనసేన పార్టీ స్థాపించారు.

2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఇక జనసేన పని అయిపోయిందని అందరూ భావించారు. అయితే కొన్నాళ్లు రాజకీయాలకు,సినిమాలకు దూరంగా ఉన్న పవన్ మూడేళ్ల తరువాత సినీ ఎంట్రీ ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ఫ్యాన్స్, జనసేన నాయకుల్లో జోష్ పెంచారు. అయితే ఇప్పటికీ పవన్ సినిమాలకే పరిమితం అవుతారని అనుకున్నారు.

కానీ పొలిటికల్ వేడినీ పెంచారు పవన్. ప్రజల తరుపున పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య పలుచోట్ల పర్యటనలు చేసి రైతుల సమస్యలపై అనేక సమావేశాలు నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ చేసిన పర్యటన కాస్త ఫలితాన్నిచ్చింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన ప్రభావం కనిపించింది. ఈ జోష్ లో పవన్ నిత్యం సమావేశాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రజల తరుపున ప్రతీ సమస్యను తీసుకొని పోరాటం చేస్తున్నారు. దీంతో జనసేనకు మరింత బలం పెరిగింది. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ జనసేన నాయకులు గెలుపొందారు.

తాజాగా జనసేన ఏపీలో ఉన్న రోడ్ల దుస్థితిపై పోరాటం చేస్తున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్ల ఫొటోలను సోషల్ మీడియాలో చూపిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో జనసేన నాయకులు తమ సొంత ఖర్చులతో రోడ్లను మరమ్మతులు చేసుకుంటన్నారు. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ప్రజలు జనసేన గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ ప్రభుత్వపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా పవన్ చేస్తున్న కార్యక్రమాలపై ఇటు పార్టీలో, అటు ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు.