Begin typing your search above and press return to search.

జగన్ మీద జనసేన టీజింగ్ మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   13 April 2023 2:36 PM GMT
జగన్ మీద జనసేన టీజింగ్ మామూలుగా లేదుగా
X
జగన్ జనసేనకు దొరికిపోయారా అంటే సీన్ చూస్తే అలాగే ఉంది. జనసేన ఇపుడు జగన్ని మనసారా అభినందిస్తోంది. జగన్ ఈజ్ గ్రేట్ అంటోంది. చప్పట్లు కొట్టి మరీ ప్రశంసిస్తోంది. ఇదంతా ఎందుకు అంటే దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సృష్టించారనే జనసేన సంబరం.

ఏపీ అప్పుల రాష్ట్రం, పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. కానీ ఏపీని ఏలుతున్న సీఎం మాత్రం దేశంలోనే నంబర్ వన్ కుబేరుడు. ఇది ఎంత బాగుందో అని జనసేన నేతలు వెటకారం ఆడుతున్నారు. మీ బిడ్డకు ఏమీ లేదు, ఎవరూ లేరు, కడు నిరుపేద అంటూ సభలలో జగన్ చెప్పే బీద కబుర్ల మీద ఇపుడు వైసీపీ నేతలు ఏమంటారు అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.

జగన్ పాలనలో ఏపీ దేశంలో అప్పులలో మొదటి ప్లేస్ లో ఉంటే జగన్ మాత్రం సంపన్నుల సీఎంలలో రికార్డులు బద్ధలు కొడుతున్నారని ఇది ఎలా సాధ్యమో వైసీపీ నేతలే చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో చూస్తే ఆస్తులు అన్నీ జగన్ కే ఉన్నట్లుగా ఉన్నాయని, అప్పులు మాత్రం ప్రజల ఖాతాలో చేరిపోయాయని, అందుకే ఏపీ దారుణంగా ఉందని అంటున్నారు. మా నమ్మకం నీవే జగన్ కాదు, మీ బిడ్డ జగన్ అత్యంత సంపన్నుడు అని ప్రతీ ఇంటి గోడల మీద స్టిక్కర్లు అతికించాలని జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు జగన్ దేశంలోనే అత్యంత అవినీతి అయిన సీఎం అని జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు.

కంగ్రాట్యులేషన్స్ సీఎం సర్ అంటూ హ్యాష్ ట్యాగ్ పేరుతో తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ జగన్ కి సెటైరికల్ గా అభినందనలు చెప్పడం విశేషం. జగన్ కి ఉన్న ఆస్తులు 510 కోట్ల రూపాయలు అని ఆయన అవినీతి అక్రమ సంపాదన బయటకు తీస్తే ఏపీ బాగుపడుతుందని కిరణ్ రాయల్ అంటున్నారు.

తనకు ఇన్ని ఆస్తులు ఉన్న సంగతిని జగనే మరచిపోయారని, ఆయన తాజాగా వివిధ సభలలో పేదవాడిని పేదల పక్షమని చెబుతున్నారని కిరణ్ రాయల్ ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కి ఇన్నేసి ఆస్తులు ఉంటే పాపం ఆయనకు తెలియదని, ఇపుడు లోకానికి మొత్తానికి తెలిసిందని కిరణ్ రాయల్ కామెంట్స్ చేస్తున్నారు.

జగన్ హయాంలో ఏపీ సంగతి ఎలా ఉన్నా సీఎం వరకూ దేశంలో నంబర్ వన్ ర్యాంక్ కి సాధించారని ఇది నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఇప్పటిదాకా ఏపీకి ర్యాంకులు ఏవీ రాలేదు అన్న బాధ ఉందని దాన్ని జగన్ ఈ విధంగా తీర్చేశారు అని అంటున్నారు. ఏపీలో అవినీతి పాలన మీద అసమర్ధ పాలన మీద జనసేన పోరు చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి జనసేన నుంచి ఈ రేంజిలో సెటైర్లు వస్తాయని బహుశా వైసీపీ ఊహించి ఉండదేమో.