Begin typing your search above and press return to search.

బొత్సను టార్గెట్ చేస్తున్న జనసేన...?

By:  Tupaki Desk   |   8 July 2023 9:39 AM GMT
బొత్సను టార్గెట్ చేస్తున్న జనసేన...?
X
వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను జనసేన టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రా నుంచి డజన్ కి తక్కువ లేకుండా సీట్లను పొత్తులో భాగంగా తీసుకోవాలని జనసేన ఆలోచిస్తోంది. అందులో విశాఖ నుంచి అయిదు విజయనగరం నుంచి మూడు, శ్రీకాకుళం నుంచి మూడు సీట్లు తీసుకోవాలని చూస్తోంది అంటున్నారు.

విజయనగరం ఎంపీ సీటు మీద కూడా జనసేన కన్ను ఉందని ప్రచారం సాగుతోంది. దాని కంటే ముందు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి సీటునే జనసేన టార్గెట్ చేస్తోంది అని తెలుస్తోంది. బొత్స ఈ సీటు నుంచి 2004, 2009, 2019లలో మూడు సార్లు గెలిచారు. ఆయన గెలిచిన ప్రతీ సారీ మంత్రిగానే ఉన్నారు.

రాజకీయంగా చూసినా బొత్స వ్యూహకర్త. అనుభవశాలి. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పండిపోయారు. ఆయన 2024లో మరోసారి చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన మీద 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిన కిమిడి నాగార్జున 2024లోనూ ప్రత్యర్ధిగా ఉంటారని అంతా అనుకుంటున్నారు.

ఇక నాగార్జున కూడా రాజకీయ నేపధ్యం ఉన్న వారే. ఆయన తల్లి కిమిడి మృణాళిని మంత్రిగా పనిచేశారు. పెదనాన్న కిమిడి కళా వెంకటరావు దన్నుగా ఉన్నారు. దాంతో నాగార్జున తన విజయం ఖాయమని భావిస్తున్నారు. ఆయూన దూకుడుగా చీపురుపల్లిలో తిరుగుతున్నరు. పల్లె నిద్రలు కూడా చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణను ఎక్కడికక్కడ గట్టిగా విమర్శిస్తున్నారు. ఇపుడు అలాంటి సీట్లో పాగా వేయాలని జనసేన భావిస్తోంది. బొత్సను ఓడించేది తామె అంటోంది. బొత్స జనసేన మీద ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. దాంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రా రాజకీయాల్లో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్సని ఓడించడం రాజకీయంగా అతి పెద్ద విజయంగా జనసేన భావిస్తోందిట.

మరి జనసేనకు బొత్సను ఓడించే బిగ్ ఫిగర్ ఉన్నారా అన్నది చూడాలి. అయితే చీపురుపల్లిలో జనసేన బలంగా ఉందని, అందువల్ల తాము రంగంలోకి దిగితే తిరుగులేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక మహిళా నేత జనసేలో కీలకంగా ఉన్నారు. ఆమె పోటీ చేయవచ్చు అని అంటున్నారు. మరి టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీటు ఇస్తుందా జనసేనకు సహకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.