Begin typing your search above and press return to search.

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై జనసేన సీరియస్.. పొత్తు క్యాన్సిల్?

By:  Tupaki Desk   |   28 Nov 2020 11:10 AM GMT
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై జనసేన సీరియస్.. పొత్తు క్యాన్సిల్?
X
గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన–బీజేపీల మధ్య పొత్తు బెడిసికొట్టేలా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన మద్దతు కోరలేదంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడ్డారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లి పవన్‌ను కలిసిన విషయం అర్వింద్‌కు తెలియదా అని తెలంగాణ జనసేన ఇన్‌చార్జి వేమూరి శంకర్ గౌడ్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకుంటే వీడియోలు చూసి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు.

అంతకుముందే జీహెచ్‌ఎంసీలో జనసేన పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. కొందరు అభ్యర్థులు నామినేషన్‌ కూడా వేశారని.. అయితే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకులు కోరితే ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు వివరించారు. అందుకే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని అర్వింద్ గుర్తెరగాలని సూచించారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడంతో కాస్త నిరాశకు గురైనప్పటికీ అధ్యక్షుడి మాట జవదాటకూడదని నిర్ణయించుకున్నారని శంకర్‌ గౌడ్ స్పష్టం చేశారు. పవన్ ఆదేశాల మేరకు జనసేన క్యాడర్ సైతం బీజేపీకి మద్దతుగా ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తోందని.. బైకు ర్యాలీలు కూడా తీస్తున్నారని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో పసలేని వ్యాఖ్యలు చేసి క్యాడర్‌ మనోభావాలను దెబ్బతీయడం సరికాదని సలహా ఇచ్చారు.

ఇటీవల బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన బీజేపీ మైత్రిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లలేదని, జనసేన అధినేతే బీజేపీ దగ్గరకు వచ్చారని చెప్పుకొచ్చారు. సినిమా స్టార్‌గా పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తానని చెప్పిన ఆయన.. రాజకీయాల్లో మాత్రం పవన్‌ పార్టీని మిత్రపక్షంగానే చూస్తామన్నారు. ఇక ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వారిని బీజేపీ ఆహ్వానించలేదని వారే మోడీ పాలనపై ఆకర్షితులై బీజేపీలో చేరారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కత్తి కార్తీక, మాజీ మేయర్ బండ కార్తీక, సర్వే సత్యనారాయణ లాంటి పేర్లను ప్రస్తావించారు.

ఇప్పటికే గ్రేటర్‌‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ కనిపిస్తుండగా.. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రేటర్‌‌ మంచి ఊపులో ఉన్న బీజేపీకి ఇప్పుడు జనసేన కొరకరాని కొయ్యలా తయారవుతుందా..? లేకుంటే వాటిని పట్టించుకోకుండా మిత్రపక్షంలా కొనసాగుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.