Begin typing your search above and press return to search.

రాజోలులో జనసేన ప్రభంజనం.. రాపోలుకు భారీ షాక్

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:37 AM GMT
రాజోలులో జనసేన ప్రభంజనం.. రాపోలుకు భారీ షాక్
X
ప్రజల్ని విపరీతంగా ఆకర్షించే గుణం ఉన్న జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ కున్న గుర్తింపు అంతాఇంతా కాదు. అయినప్పటికీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో స్వయంగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో.. పవన్ పని అయిపోయిందని..ఆయన పార్టీ మూసివేయటం మినహా మరింకేమీ మార్గం లేదన్న మాట వినిపించింది. అయినప్పటికి తాను గెలుపోటములకు అతీతమని చెప్పినట్లే.. తనదైన రాజకీయాల్ని చేపట్టారు. ప్రజా సమస్యల మీద పోరాడుతూ.. ఏపీలో అధికారపార్టీకి సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనసేన ప్రభావం అంతంతమాత్రమేనన్న భావన కలిగేలా ఫలితాలు ఉన్నాయి. అయితే.. అనూహ్యంగా రాజోలు నియోజకవర్గంలో జనసేన మద్దతుదారులు క్రియేట్ చేస్తున్న సంచలన విజయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడినా.. ఆయన పార్టీకి సంబంధించి రాపాక ఒక్కరే విజయం సాధించారు. అధినేత ఓడి.. పార్టీ నేత ఎన్నికల్లో గెలిచిన సిత్రమైన పరిస్థితి నెలకొంది.

అయితే.. చాలా తక్కువ కాలంలోనే అధికార పార్టీతో చెట్టాపట్టాలు వేసుకొని.. పవన్ కు బలం లేదని.. తన సొంత బలంతో తాను ఎన్నికల్లో గెలిచినట్లుగా అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలకు.. చేసిన చేష్టలకు తాజాగా నియోజకవర్గప్రజలు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చారు. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మెజార్టీ పంచాయితీల్ని జనసేన అభ్యర్థులు సొంతం చేసుకోవటం సంచలనంగా మారింది.

దీంతో అధికార పార్టీతో అంటకాగిన జనసేన ఎమ్మెల్యే రాపాకకు దిమ్మ తిరిగే షాకిచ్చారని చెప్పాలి. ఆదివారం అర్థరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం 16 స్థానాల్లో జనసేనదే విజయంగా చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన మద్దతుదారులు గెలిచినంతనే.. ఆ వివరాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజా ఫలితాలు స్థానిక ఎమ్మెల్యే రాపాకకు చెప్పుదెబ్బతో సమానమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజోలులో సాధించిన విజయం రానున్న రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకునే మార్పుకు తొలి అడుగుగా పలువురు జనసైనికులు అభివర్ణిస్తున్నారు.