Begin typing your search above and press return to search.

'రాపాక'కు నిరసన సెగ: వైసీపీ నేత అండదండలతోనేనా..?

By:  Tupaki Desk   |   12 Dec 2021 10:30 AM GMT
రాపాకకు నిరసన సెగ: వైసీపీ నేత అండదండలతోనేనా..?
X
జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. నాడు తమ నేత గెలుపు కోసం కృషి చేసిన జనసేన కార్యకర్తలే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. అధికారికంగా వైసీపీలోకి జాయిన్ కాకున్నా రాపాక మాత్రం ఆ పార్టీ నాయకులతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. దీంతో గ్లాసు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే త్వరగా దిగొపో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా రాపాక జనసేన పార్టీకి దూరంగా ఉంటూ ఆ పార్టీపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆయనపై జనసైనికులు విరుచుకుపడుతున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరుపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే రాపాక గెలుపులో జనసేన నాయకుల కృషి ఎంతో ఉంది. తమ నేత గెలిపిస్తే పార్టీతో కలిసుంటాడని ఆయనను గెలిపించారు. అయితే జనసేన పార్టీ మిగతా ఎక్కడా గెలుచుకోలేదు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కొన్ని రోజుల పాటు పార్టీలో కొనసాగిన రాపాక ఆ తరువాత వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.

ఈ మధ్య తాను వైసీపీ ఎమ్మెల్యేనే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అధికారిక పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. దీంతో జనసైనికులు రాపాక వరప్రసాద్ పై తిరుగుబాటు ప్రకటించారు. గ్లాసు గుర్తుపై గెలిచిన రాపాకను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆయన నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా అక్కడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక 'రాపాక .. గోబ్యాక్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇటీవల జనసేన కాస్త పుంజుకుంటోంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన ప్రతాపం చూపించింది. ఇదే జిల్లాలోని మల్కిపురం మండంలోని రెండు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. దీంతో రాపాక వరప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నా అతని క్యాడర్ మాత్రం ఇంకా జనసేన పార్టీలోనే ఉన్నామంటూ నిరూపిస్తున్నారు. ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా రాజోలు మండలం కాట్రేనిపాడులో ఎమ్మెల్యే పర్యటనలో కొందరు జనసైనికులు 'రాపాక గోబ్యాక్' అంటూ ఫ్లెక్సీలు పెట్టడం దూమారం లేపింది.

మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే.. మాకొద్దు.. అంటూ నినాదాలు చేశారు.అంతేకాకుండా మాకు ఎందుకు ద్రోహం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాట్రేనిపాడు ఎమ్మెల్యేను నిలదీసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అక్కడికి వచ్చి జనసేన సైనికులతో చర్చలు జరపడంతో ఆందోళన విరమించుకున్నారు. అంతేకాకుండా వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే తాము శాంతియుత నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకున్నారని కొందరుఆరోపించారు. పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి రావడం సిగ్గు చేటన్నారు.

ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడుతూ ఇకపై రాపాక ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే కొందరు జనసేన కార్యకర్తలపై రాపాక కేసులు పెట్టించారు. దీంతో వారు మరింత రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జనసేనికులు ఇలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ఓ అధికార పార్టీ నేత ఉన్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. వైసీపీకి చెందిన ఓ నేత నుంచి రాపాకకు బాధ్యతలు అప్పగించడంతో అది జీర్ణించుకోలేని ఆ నేత జనసేన సైనికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.