Begin typing your search above and press return to search.

పవన్.. గజనీలాగ తయారయ్యాడా ?

By:  Tupaki Desk   |   16 Aug 2021 4:55 AM GMT
పవన్.. గజనీలాగ తయారయ్యాడా ?
X
రాజకీయాల్లో కిరీటం లేని రాజరికం అమలవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నట్లు ఆయన తెగ బాధపడిపోయారు. నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు లేదా ఆయన కుటుంబానికే ముందు వర్తిస్తాయన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. రాజకీయాల్లో కిరీటం లేని రాజరికం అనే వ్యాఖ్యనే చూస్తే ఇదే తరహా రాజకీయాలు సినీఫీల్డులో కూడా బలంగానే కనిపిస్తోంది.

తెలుగు సినిమా ఫీల్డులో ఇపుడు అగ్రహీరోలుగా ఉన్న వారిలో అత్యధికులు కిరీటం లేని రాజుల్లాగే వ్యవహరిస్తున్నారో ఆరోపణలున్నాయి. అలాగే రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని చేసిన కామెంట్ కూడా ముందు తమ కుటుంబానికే వర్తిస్తాయన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు. చిరంజీవి తర్వాత సినిమాల్లోకి వచ్చిన నాగుబాబు, పవన్ కల్యాణ్ మొదలుకుని చాలామంది వారసత్వాన్ని నమ్ముకుని వచ్చినవారే.

సొంత బావ, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను తప్పిస్తే మిగిలిన వారంతా వారసత్వంగా ఫీల్డులోకి ప్రవేశించిన వారే అన్న విషయం మరచిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అరవింద్ కూడా తన తండ్రి అల్లురామలింగయ్య వారసునిగా ఫీల్డులోకి వచ్చినవారే అని అందరికీ తెలిసిందే. చిరంజీవే ఫీల్డులో నిలదొక్కోకపోయుంటే కొణిదెల, అల్లు వారసులంతా ఇప్పుడెక్కడ ఉండేవారో. పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల వారసులు అదే వృత్తుల్లోకి ప్రవేశించనట్లే సినీ, రాజకీయాల్లో కూడా వారసులు తయారవుతున్నారు.

వారసులుగా ఎవరు ఏ రంగంలోకి ప్రవేశిస్తున్నా సొంతంగా ప్రతిభ ఉంటేనే రాణించగలుగుతున్నారు. సినిమాల్లో వారసులను పెట్టి పదిసినిమాలు తీసి బలవంతంగా స్టార్ అనిపించుకునే అవకాశం ఉందేమో. రాజకీయాల్లో అలాంటి ఛాన్సు లేదన్న విషయం పవన్ మరచిపోయారు. రాజకీయాల్లో కూడా పవన్ ప్రవేశించింది చిరంజీవి వారసునిగానే. వారసత్వ హోదాలో సినిమాల్లో సక్సెస్ అయిన పవన్ రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడించటంతోనే పవన్ను జనాలు అంగీకరించలేదని అర్ధమవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయమంటారా తన కెపాసిటిని రుజువు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారసునిగానే రాజకీయాల్లోకి ప్రవేశించినా తానేంటో నిరూపించుకున్నారు. అందుకనే జనాలు కూడా 151 సీట్లిచ్చి వైసీపీకి అఖండ మెజారిటి కట్టబెట్టారు. కాబట్టి వారసత్వ రాజకీయాలని, కిరీటం లేని రాజరికమనే అనవసరమైన కామెంట్లతో టైం వేస్టు చేసుకోకుండా రాబోయే ఎన్నికల్లో తన కెపాసిటి ఏమిటో చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెడితే బాగుంటుంది.