Begin typing your search above and press return to search.

బీజేపీ మీద పడ్డ పవన్...వైసీపీకి షాక్

By:  Tupaki Desk   |   16 March 2023 5:00 AM GMT
బీజేపీ మీద పడ్డ పవన్...వైసీపీకి షాక్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవ ఆవిర్భావ సభ ఏరి కోరి మచిలీపట్నంలో పెట్టారు. అది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని సీటు. ఇక పవన్ ఎపుడూ వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వస్తారు. ఆయన ప్రసంగం మొత్తం వారి మీదనే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ అటు తిరిగు ఇటు తిరిగి బీజేపీ మీద పడ్డారు అని అంటున్నారు. ఆయన ఈ సభలో జగన్ మీద పెద్దగా కామెంట్స్ చేయలేదు, అదే టైం లో పేర్ని నానిని ఏమీ అనలేదు.

కానీ బీజేపీకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చేశారు. దానికి గానూ మైనారిటీలను అడ్డం పెట్టుకున్నారు. మైనారిటీ సోదరుల విషయంలో బీజేపీ దాడులు చేస్తే కనుక తాను చూస్తూ ఊరుకోనని, వెంటనే ఆ పార్టీతో పొత్తు తెంచుకుంటాను అని పవన్ బహిరంగ సభలోనే క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చెప్పిన కారణం ఏమైనప్పటికీ బీజేపీతో పొత్తు తెంచుకుంటాను అని పవన్ నోటి వెంట రావడమే ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు, కుదుపు అనుకోవాల్సి ఉంటుంది.

ఇక గత ఏడాది ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తాము ఏపీలో వైసీపీని దించేందుకు యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ సందేశం ఒకటి పంపారు. దానికి ఒక ఏడాది గడచినా బీజేపీ నుంచి జవాబు రాకపోవడంతో పవన్ ఇపుడు కమలంతో ఏదో ఒకటి తేల్చాలని భావించినట్లున్నారు అని అంటున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పట్లోగా పొత్తుల విషయంలో ఒక స్పష్టత తెచ్చుకోకపోతే ఎన్నికల ముందు ఇబ్బంది అవుతుందని జనసేనలోనే అనుకుంటున్న మాట. ఇక బీజేపీతో 2020 జనవరిలో పవన్ చేతులు కలిపారు. ఏకంగా ఢిల్లీ వెళ్ళి ఆయన పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు కాస్తా పెద్దగా వర్కౌట్ కాలేదు. రెండు పార్టీలు కలసి చేసిన ఆందోళనలు అయితే ఎక్కడా లేవు. దాంతో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి వేరు పడాలని కొద్ది కాలం క్రితం నుంచే ఆలోచిస్తున్నారు అని కూడా ప్రచారం సాగింది.

ఈ తరుణంలో గత అక్టోబర్ లో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుని మంతనాలు జరిపారు. వాటి సంగతి ఏంటి అన్నది ఎవరూ వెల్లడించలేదు. అయితే బీజేపీతో పవన్ కలసి నడుస్తారు అని ప్రచారం మాత్రం జరిగింది. ఇప్పటికి ఆరు నెలలు గడచినా ఆ దిశగా ఏమీ అడుగులు ముందుకు పడలేదు. మరో వైపు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించలేదు. వైసీపీని ఓడించాలని మాత్రమే పిలుపు ఇచ్చింది.

ఇపుడు బీజేపీతో పొత్తుని తెంచుకునే క్రమంలోనే పవన్ మైనారిటీల మీద దాడులు అంటూ కామెంట్స్ చేశారని అంటున్నారు. నిజానికి ఏపీలో మైనారిటీల మీద దాడులు అన్న ప్రశ్నే లేదు. బీజేపీకి కూడా అంత బలం లేదు. కానీ పవన్ సడెన్ గా మైనారిటీలను ముందుకు తేవడంలో ఆంతర్యం ఏంటి అంటే బీజేపీతో పొత్తుని తెంచుకోవడమే అంటున్నారు.

దానికి సరైన సమయం చూసి తెంచుకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే తన తప్పు లేకుండా బీజేపీ మీదనే నింద మోపి పొత్తుల నుంచి పక్కకు జరగాలని పవన్ ఆలోచన అని అంటున్నారు. ఈ సంగతి తెలిసిన బీజేపీ కూడా పవన్ మాకు మిత్రుడే అని అంటోంది. పొత్తుల మీద ఏ సంగతీ ఆయన నోటి వెంట వినాలని చూస్తోంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే పొత్తుల విషయంలో పవన్ ఏమీ చెప్పలేదు కదా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. అంటే పవన్ ఏదైనా ప్రకటన చేస్తే దాని తరువాతనే తమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే మచిలీపట్నం మీటింగ్ అందునా జనసేన పదవ ఆవిర్భావ సభ, మైలు రాయి లాంటి సభలో వైసీపీ మీద విమర్శల జడివాన కురుస్తుంది అనుకుంటే పవన్ బీజేపీ మీద పడ్డారని అంటున్నారు. దీంతో పవన్ నుంచి సరైన హాట్ కామెంట్స్ లేకపోవడంతో వైసీపీ కూడా షాక్ తిందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.