Begin typing your search above and press return to search.

చైత‌న్య ర‌థం త‌ర‌హాలో ప‌వ‌న్ ప్ర‌చార ర‌థం!

By:  Tupaki Desk   |   25 Nov 2022 1:30 AM GMT
చైత‌న్య ర‌థం త‌ర‌హాలో ప‌వ‌న్ ప్ర‌చార ర‌థం!
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చార ర‌థం శ‌ర‌వేగంగా ముస్తాబ‌వుతోంది. ఈ ప్ర‌చార ర‌థం సొబ‌గులు అద్దుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ ప్ర‌చార ర‌థంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులోనే ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ వాహ‌నం రూపురేఖ‌ల‌ను నాడు ఎన్టీఆర్ ప్ర‌చారానికి ఉప‌యోగించిన చైత‌న్య ర‌థంతో పోల్చుతూ సామాజిక మాద్య‌మాల్లో చ‌ర్చ‌లు జోరుగా సాగుతోంది.

అన్న నంద‌మూరి తార‌క‌రామ‌రావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన త‌రువాత ప్ర‌చారం కోసం ప్ర‌త్యేకంగా చైత‌న్య ర‌థం రూపొందించుకుని ఆంధ్ర‌రాష్ట్ర‌మంత‌టా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ఎన్టీఆర్ ఉప‌యోగించి చైత‌న్య ర‌థం చిర‌స్థాయిగా నిలిచిపోయింది.

ఇప్పుడు జ‌న‌సేనాని కూడా అదే త‌ర‌హాలో జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డానికి త‌న ప్ర‌చార ర‌థాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దుతున్నారు. ఈ వాహ‌నంలోనే ఆయ‌న బ‌స చేసేట‌ట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 2024లో ఎన్నిక‌లు జ‌రిగేంత వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌కు ఈ వాహ‌నంలోనే వెళ్లి క‌లుసుకోనున్నారు.

బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా ఈ వాహ‌నం నుంచే ప్ర‌సంగించ‌నున్నారు.

ఈ వాహ‌నానికి మెరుగులు దిద్దే ప‌నులు మొద‌ట్లో పుణేలో చేప‌ట్టాల‌ని అనుకున్నారు. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌లు స‌ల‌హాల మేర‌కు జ‌న‌సేన నాయ‌కులు ఈ వాహ‌నాన్ని హైద‌రాబాద్‌లోనే ముస్తాబు చేస్తున్నారు.

వాహ‌నం ఎక్క‌డా కూడా ఆడంబ‌రంగా క‌నిపించ‌కుండా, చాలా సాధార‌ణంగా, పాత వాహ‌నంలా ఉంటూ సామాన్యుల‌కు కూడా చాలా ద‌గ్గ‌ర‌గా ఆక‌ట్టుకునేలా ఈ వాహానాన్ని రూపొందిస్తున్నారు. త‌ద్వారా జ‌నాల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌గ‌ల‌గాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌.

వాహ‌నానికి మిల‌ట‌రీ గ్రీన్ క‌ల‌ర్ వేస్తున్నారు. త‌ద్వారా దేశ‌భ‌క్తిని చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్ వాడిన చైత‌న్య‌ర‌థం రంగు కూడా మిల‌ట‌రీ గ్రీన్ క‌ల‌ర్ కావ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చార ర‌థాన్ని ఎన్టీఆర్ చైత‌న్య ర‌థంతో పోల్చుతున్నారు.

సామాజిక మాధ్య‌మాల్లో ఇప్పుడు ఈ రెండు వాహ‌నాల మ‌ధ్య పోలిక‌ల‌పై ఇప్పుడు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.