Begin typing your search above and press return to search.

తాను దూర సందు లేదు.. తెలంగాణ‌లో ప‌వ‌న్ పై ట్రోలింగ్స్‌..!

By:  Tupaki Desk   |   22 May 2022 12:30 AM GMT
తాను దూర సందు లేదు.. తెలంగాణ‌లో ప‌వ‌న్ పై ట్రోలింగ్స్‌..!
X
సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తెలంగాణ‌లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమ్స్‌, ట్రోలింగ్స్‌తో ఎండ‌గ‌డుతున్నారు. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీని విస్త‌రిస్తాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న తాజాగా వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం.

తాను దూర సందు లేదు.. మెడ‌కేమో డోలా.. త‌ర‌హాలో ఇప్ప‌టికే ఇబ్బ‌డిముబ్బ‌డిగా పార్టీలు పెరిగాయ‌ని.. ఇంకా ఇందులో ఆయ‌న‌కు స్పేస్ ఎక్క‌డుంటుంద‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న ఏపీకే ప‌రిమితం అయితే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు. లేదంటే రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యార‌వుతార‌ని హెచ్చ‌రిస్తున్నారు.

తెలంగాణ‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌ధాన పార్టీల‌తో త్రిముఖ పోరు న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకునేందుకు టీఆర్ఎస్ తీవ్రంగానే కృషి చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు విఫ‌ల‌మైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని చూస్తోంది. ఓటుకు నోటు కేసుతో గ‌ల్లంతైన టీడీపీ స్థానాన్ని ద‌క్కించుకొన్న బీజేపీ కూడా పాగా వేయాల‌ని భావిస్తోంది. ఈ త్రిముఖ పోరు వ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి తిరిగి టీఆర్ఎస్సే అధికారంలోకి వ‌స్తుంద‌నే వాద‌న‌లు లేక‌పోలేదు.

ఇవీ కాకుండా టీడీపీ, క‌మ్యూనిస్టు పార్టీలు, కోదండ‌రాం జ‌న స‌మితి పార్టీ, చెరుకు సుధాక‌ర్ తెలంగాణ ఇంటి పార్టీ, కేఏ పాల్ ప్ర‌జా శాంతి, బీఎస్పీ, ఇంకా చిన్నా చిత‌క పార్టీలు పోటీలో ఉంటాయి. ఇవి స‌రిపోవ‌న్న‌ట్లు ఇటీవ‌ల వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె ష‌ర్మిల కొత్త పార్టీ స్థాపించి తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్నారు. దానికితోడు ఇపుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అరంగేట్రం తెలంగాణ స‌మాజాన్ని విస్మ‌య‌ప‌రుస్తోంది. ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలు ఏ ధీమాతో బ‌రిలో దిగుతున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తెలంగాణ‌లో 30 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు ఐదారువేల ఓట్లు ఉన్నాయ‌ని తాజాగా న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ పేర్కొన్నారు. అంటే దీన్ని బ‌ట్టి గెలుపోట‌ములు ప‌క్క‌న పెడితే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీని వెనుక రాజ‌కీయ శ‌క్తుల పాత్ర ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌వ‌న్ లోపాయికారీగా టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇస్తారా.. బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తారా అనే సందేహాలు నెల‌కొన్నాయి.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తెలంగాణ‌లో ప‌వ‌న్ ది సినిమా అభిమాన‌మేన‌ని.. రాజ‌కీయ ల‌బ్ధి ఉండ‌ద‌ని విశ్లేషిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో ఒకే స్థానానికి ప‌రిమితమైన ప‌వ‌న్ తెలంగాణ‌లో ఏం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌న అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెడితేనే కేవ‌లం నిర్మ‌ల్ లో ఒక స్థానంలోనే గెలిచింది. ప‌వ‌న్ లో నిల‌క‌డ ఉండ‌ద‌ని.. చిరంజీవికి ఉన్న క్రెడిబులిటీ కూడా ప‌వ‌న్ లో లేద‌ని అంటున్నారు. తెలంగాణ‌లో జ‌న‌సేన పాత్ర నామ‌మాత్రంగానే ఉంటుంద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ ఉద్దేశం ఏమిటో.. ఆయన రాక వ‌ల్ల ఎవ‌రికి ప‌రోక్షంగా మేలు క‌లుగుతుందో వేచి చూడాలి.