Begin typing your search above and press return to search.

టైమ్ చూసి బీజేపీకి దెబ్బేసిన జనసేన సైన్యం

By:  Tupaki Desk   |   18 March 2023 8:00 AM GMT
టైమ్ చూసి బీజేపీకి దెబ్బేసిన జనసేన సైన్యం
X
బీజేపీ అసలే మూలిగే నక్క చందంగా ఏపీ రాజకీయల్లో ఉనికిపాట్లు పడుతోంది. దశ ఏ దశాబ్దలోనైనా తిరగకపోతుందా అని ఎదురుచూస్తున్న నేపధ్యం ఉంది. అలాంటి బీజేపీ జనసేనతో పొత్తు అంటే ఎగిగి గంతేసింది. ఇంకేముంది థర్డ్ ఫోర్స్ అని ఊదరగొట్టింది. అయితే తప్పు ఏ వైపు నుంచి జరిగింది అన్నది ఇక్కడ అప్రస్తుతం కానీ మచిలీపట్నం సభలో పవన్ పేల్చిన పంచులు బీజేపీ పొత్తుని తెంచేస్తాను అంటూ చేసిన ఇండైరెక్ట్ హెచ్చరికలు ఇంకా చెవుల్లో మారుమోగుతుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆశలను సాంతం చంపేసిన వైనం కళ్ళ ముందు కట్టేసింది.

ఏపీలో బీజేపీకి దాని సొంత బలమే ఎపుడూ దిక్కు అని మరో మారు రుజువు అయింది. చతుర్ముఖ పోరుగా ఉత్తరాంధ్రా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మొదలైన కధ కాస్ద్తా చివరికి బీజేపీ సోదిలో లేకుండా పోవడంతో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వ్యవహారం ముగిసింది. బీజేపీకి జనసేన తోడు అయితే పీడీఎఫ్ అభ్యర్ధి కి ముందో వెనక వచ్చి నిలబడేది కానీ ఇపుడు పూర్తిగా ట్రయాంగిల్ పోరుగా సీన్ మారిపోయిన వేళ కమలం ఎక్కడా కనబడకుండా కమిలిపోయింది.

మొత్తం ఓట్లను టీడీపీ వైసీపీ పీడీఎఫ్ పంచేసుకుంటే ఆ మిగిలిన ఓట్లలో బీజేపీకి ఎన్ని వచ్చాయన్నది అంతా బుర్రలకు పదును పెట్టి ఆలోచించాల్సింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిశాక టీడీపీకి 80 వేల 762 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 54,403 ఓట్లు వస్తే పీడీఎఫ్ కి 33,464 ఓట్లు వచ్చాయి మొత్తం పోల్ అయిన ఓట్లు 2 లక్షల పై చిలుకు అని లెక్క తేలింది. ఇందులో చెల్లని ఓట్లు 12 వేల 318గా ఉంది. దాంతో లెక్కించిన ఓట్లు 1 లక్షా 89 వెల 17గా అధికారులు పేర్కొన్నారు.

ఇందులో నుంచి మూడు పార్టీలు పోతే బీజేపీకి చాలా తక్కువగా ఓట్లు వచ్చాయని అంటున్నారు. పైగా ఇది సిట్టింగ్ సీటు, ఈ నెల 29 వరకూ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కి పదవి చేతిలో ఉంటుంది. అయితే బీజేపీకి జనసేన మద్దతు ఈ ఎన్నికల్లో దక్కలేదు అని స్పష్టంగా తేలిపోయింది. పైగా జనసేన సైన్యం అంతా టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా ఓటేశారు అని ప్రచారం సాగింది.

ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు పోల్ అయ్యాయంటే జనసేన మహిమ చాలానే ఉంది అంటున్నారు. అంటే ఈ ఎన్నికలలో ఒక పరమ సత్యం తెలిసింది. నిన్న నోటి వెంట బీజేపీతో పొత్తు అవసరం అయితే తెంచుకుంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటల కంటే ఒక రోజు ముందే చేతల ద్వారా జనసేన సైన్యం ఆ పనిచేసి చూపించారు అని అంటున్నారు.

ఈ పరిణామంతో కమలదళం వాడిపోయింది అని అంటున్నారు. బీజేపీ మద్దతు మాకే అని ఒకటికి పదిసార్లు చెప్పిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుఇకు ఈ రిజల్ట్స్ చూస్తే వాస్తవాలు ఏంటో అర్ధం అవుతాయని అంటున్నారు. అలాగే బీజేపీ నేతల వెంట మచ్చుకైనా జనసేన నేతలు కనిపించలేదు అంటున్నారు. ఇక ఒక్క ప్రకటన కూడా సానుకూలంగా చేయలేదు

ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పాలూ నీళ్ల మాదిరిగా టీడీపీ జనసేన స్నేహం క్షేత్ర స్థాయిలో మరింతగా కలసిపోయింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులోకి వెళ్తే జనసేన నుంచి పెద్దగా ఎవరూ నచ్చరు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఈ ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీకి ఏపీలో గట్టి షాక్ ఇచ్చేలాగానే ఈ వ్వవహారం ఉంది అంటున్నారు.

రానున్న రోజులలో టీడీపీ జనసేన కూటమితో కలిస్తేనే బీజేపీకి ఏమైనా అన్న విషయాన్ని కూడా చక్కగా చెప్పేశారు అని అంటున్నారు. ఒక వేళ అలా కాదు అనుకుంటే మాత్రం కమలానికి కుమిలిపోవడం తప్ప మిగిలేది ఏదీ లేదని కూడా ఈ రిజల్ట్స్ తేటతెల్లం చేశాయని అంటున్నారు.

ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. అఫీషియల్ గా బీజేపీకి మిత్రుడిగా ఉన్న జనసేనను తమ వైపునకు తిప్పుకునేలా ఆచీ తూచీ బలమైన సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని ఎంపిక చేయడంలోనే బాబు చాణక్య రాజకీయం దాగుందని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ మీద వత్తిడి పెరిగింది. ఇపుడు పొత్తుల వైపు చూస్తారా లేక మా దారి మాదే అంటారా అన్నదే చూడాల్సి ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.