Begin typing your search above and press return to search.

భక్తుడి కోరిక నెరవేరుస్తున్న జగన్‌!

By:  Tupaki Desk   |   6 Jun 2023 10:59 AM GMT
భక్తుడి కోరిక నెరవేరుస్తున్న జగన్‌!
X
ఇటీవల దొంగ ఓట్లతో గెలిచానంటూ కలకలం సృష్టించారు... కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. 2019లో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన రాపాక ఆ తర్వాత కొద్దికాలానికే వైసీపీ పంచన చేరారు. తన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చారు. 2024 ఎన్నికల్లో రాపాక వరప్రసాదరావుకే జగన్‌ సీటు ఖరారు చేశారు. దీంతో ఆయనను ఎలాగైనా ఓడించి తమ సత్తా చాటడానికి జనసేన పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇలా చాలెంజ్‌ చేసి మరీ పంచాయతీ ఎన్నికల్లో రాపాకకు జనసేన కార్యకర్తలు షాక్‌ ఇచ్చారు. ఆయన సొంత గ్రామంలోనూ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని సత్తా చాటారు.

కాగా తాజాగా రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ముద్రించిన పెళ్లి పత్రిక ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో వైరల్‌ గా మారింది. ఇది సర్వత్రా అందరి దృష్టిలో పడింది.

ఆ శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్, ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను రాపాక వరప్రసాదరావు ముద్రించారు. తమకు దైవ సమానులైన వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని రాపాక శుభలేఖలో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్, భారతి చిత్రాలను ఆకట్టుకునేలా ముద్రించారు. తద్వారా తన ‘స్వామి భక్తి'ని రాపాక చాటుకున్నారు.

ఇప్పటికే పలుమార్లు బయట, అసెంబ్లీలో జగన్‌ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక వరప్రసాద్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన ద్వారా తన వీర విధేయతను జగన్‌ పై రాపాక చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్‌ కు వీరభక్తుడినని రాపాక చాటుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్‌ 7వ తేదీ రాత్రి ఒంటిగంట రెండు నిమిషాలకు జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పత్రికపై తమకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో అంటూ వారిద్దరి ఫోటోను పెళ్లి పత్రిక పై ముద్రించారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి జూన్‌ 7న రాజోలులో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కుమారుడి వివాహానికి హాజరవుతారని తెలుస్తోంది.

జగన్‌ ను రాజోలు తీసుకురావడం ద్వారా నియోజకవర్గ వైసీపీలో తనకు పోటీగా ఉన్న మాల కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ పెదపాటి అమ్మాజీ తదితరులకు చెక్‌ పెట్టాలనే ఆలోచనలో రాపాక ఉన్నారని తెలుస్తోంది. 2024లో రాపాకకు జగన్‌ సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు ఇచ్చేశారు. అయితే కాపుల ఇలాకా అయిన రాజోలులో రాపాక మరోసారి గెలుపొందడం ఏమాత్రం సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాపాక రాకను జీర్ణించుకోలేని నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా కూడా చేశారు.