Begin typing your search above and press return to search.

వింటున్నావా పవన్... సైనికులు ఏమంటున్నారో...?

By:  Tupaki Desk   |   3 Sep 2022 8:01 AM GMT
వింటున్నావా పవన్... సైనికులు ఏమంటున్నారో...?
X
జనసైనికులు ఇపుడు పవన్ సినిమాలు హిట్ కావాలని మాత్రమే ఆలోచించడంలేదు. పొలిటికల్ గా కూడా పవన్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. దాంతో వారు మొక్కులు కూడా మొక్కుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విశాఖలో జనసైనికులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వారు నగరంలోని ఒక ప్రముఖ ఆలయంలో ఏకంగా వందలాది కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చారు. అలాగే పవన్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు.

అక్కడ వారు అమ్మవారికి ఒక్కటే కొరిక కోరుకున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన గెలిచి పవన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని గట్టిగానే మొక్కారు. తమ నాయకుడు ఏపీకి 2024లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని జనసైనికులు ధీమాగా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి వారంతా ఒక్కటే ఆశయం కోసం పనిచేస్తున్నట్లుగా అర్ధమవుతోంది.

జనసేనను వారు పొత్తు పార్టీగా ఏపీ రాజకీయాలో మూడవ పార్టీగా అసలు ఏ కోశానా చూడడం లేదు. ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో ఫోర్ ఫ్రంట్ లో తమ పార్టీయే ఈసారి ఉంటుందని గట్టిగా గాఢంగా నమ్ముతున్నారు. రాజకీయ లెక్కలు సమీకరణలు వారికి తెలియకపోవచ్చు. విశ్లేషణలు వారికి అర్ధం కాకపోవచ్చు. కానీ వారికి ఒక్కటే అర్ధమవుతోంది. ఏపీ రాజకీయం మారుతుంది. తమ నాయకుడు పవన్ సీఎం సీట్లో కూర్చుంటారని.

నిజానికి ఈ సైనికులు అంతా ఏడెనిమిదేళ్ళుగా పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్థానం ఎలా సాగిందో వారికి తెలుసు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసిందో ఎన్ని గెలిచిందో కూడా తెలుసు. అయితే వారు అవన్నీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, గతం గతహా ఇపుడు మాదే రాజ్యం. ఈసారి పవన్ కి జనాలు ఒక అవకాశం ఇస్తారని అంటున్నారు. ముందు చంద్రబాబుకు, ఆ తరువాత జగన్ కి చాన్స్ ఇచ్చిన ఏపీ జనాలు పవన్ కి కూడా ఒక్క చాన్స్ తప్పకుండా ఇస్తారని అంటున్నారు.

అయితే వారు చాలా కచ్చితంగా ఉన్నారు. వారి ఉద్దేశ్యంలో జనసేన మొత్తానికి మొత్తం సీట్లలో పోటీ చేస్తుంది, చేయాలి అని కూడా ఉందిలా కనిపిస్తోంది. కానీ పవన్ ఈ రోజుకీ పొత్తుల మీద కానీ పోటీ మీద కానీ విస్పష్టంగా ప్రకటన చేయలేదు. ఆయన ఆవిర్భావ సభలో మాత్రం వైసీపీ ఓట్లను చీల్చకుండా చూస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేటెస్ట్ గా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగులో కూడా వైసీపీ అన్నది లేని ఏపీని వచ్చే ఎన్నికల్లో చూడాలన్నదే తమ పార్టీ ఆలోచన అని చెప్పారు.

ఈ రెండు ప్రకటనల్లో ఎక్కడా జనసేన అధికారంలోకి వస్తుంది అని మాత్రం లేదు. అంటే పొత్తుల మీదనే జనసేనలో ఇంకా ఆలోచనలు సాగుతున్నాయని అనుకోవాలేమో. అదే టైమ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ పోటీ చేస్తాయని మరోవైపు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే పెద్దన్నగా టీడీపీకే సీఎం పదవి దక్కుతుంది అన్నది వేరేగా చెప్పాల్సింది లేదు

అయితే ఒక రాజకీయ పార్టీగా జనసేన తన లెక్కలు అంచనాలు తాను వేసుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ జనసైనికులు మాత్రం ఇవేమీ మాకు అక్కరలేదు. పవన్ సీఎం కావాలంతే అంటున్నారు. మరి అదెలా కుదురుతుంది అన్న‌దే ఇక్కడ చర్చ. పవన్ సొంతంగా మొత్తం 175 సీట్లకు పోటీ చేయడం ద్వారానే ఆ కోరిక సాకారం అయ్యే అవకాశం ఉంది. కానీ జనసేన ఈ రోజుకూ చాలా నియోజకవర్గాలలో ఇంచార్జిలను నియమించుకోలేదు. మరో వైపు చాలా చోట్ల బలమైన అభ్యర్ధులు ఉన్నారా అన్న చర్చ కూడా ఉంది.

ఇవన్నీ పక్కన పెట్టి అమ్మవారికి మొక్కుతున్న జనసైనికుల అభిమానాన్ని వారి ప్రేమను ఎవరూ కాదనలేరు. ఇదే రకమైన ఆలోచనలో జనసైనికులు ముందుకు వెళ్తే అపుడు పొత్తుల తో జనసేన అడుగులు వేస్తే వారికి తీవ్ర నిరాశ కలుగుతుంది అని కూడా అంటున్నారు. అందువల్ల జనసైనికుల మనోగతాన్ని ఇప్పటికిపుడే తెలుసుకుని వారికి తమకు అనుగుణంగా చేసుకునేలా పార్టీ ఎత్తుగడలను వివరించడమో లేక వారు కోరుతున్నట్లుగా జనసేన ఒంటరిగా తలపడడానికి ఇప్పటి నుంచే తగిన కసరత్తు చేయడమో ఏదో ఒకటి చేయాలి.

ఎంతో భక్తితో చిత్తశుద్ధితో వారు చేస్తున్న పూజలు మొక్కిన మొక్కులు అన్నీ కూడా వారికి పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ ని తెలియచేస్తోంది. వారు నిజంగా వీర‌ సైనికులే. వారిని సరిగ్గా మలచుకోగలిగితే జనసేనకు కొండంత అండ అనే చెప్పాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.