తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. చర్చల పేరుతో వ్యక్తిగత నిందలు - దూషణలు చేసుకుంటూ రాజకీయ నాయకులు వారి పరువే కాదు... పార్టీల పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు వివిధ చానెళ్ల స్టూడియోల్లో బహిరంగంగా తిట్ల పురాణాలు వినిపించిన నాయకులను అనేక మందిని చూసిన ప్రజలకు వీళ్లేం నాయకుల.... ఇవేం చర్చలూ అనే అభిప్రాయానికి ఎప్పుడో వచ్చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - ఓ సినీ రచయిత - నటుడు చర్చలో పాల్గొని ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకూ వెళ్లారు. వీరిద్దరిని నిలువరించడం ఆ యాంకర్ కు తలప్రాణం తోకలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక చానెళ్లలో ఈ చర్చల పేరుతో జరుగుతున్న రచ్చ చూసిన వారికి రాజకీయ నాయకులపై ఏవగింపు కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా వివిధ చానెళ్లలో వస్తున్న చర్చలు విసుగే కాదు..... రోత కూడా పుట్టిస్తున్నాయంటున్నారు. ఇటీవల ప్రారంభమైన ఓ చానెల్ లో జనసేన నాయకుడు - తెలుగుదేశం నాయకురాలు మధ‌్య జరిగిన చర్చపై అటు ప్రజల్లోను - ఇటు రాజకీయ వర్గాల్లోనూ కూడా తీవ్ర కలకలం రేపింది అమరావతిలో రాజధానికి సంబంధించి జరిగిన చర్చలో పాల్గొన్న జనసేన నాయకుడు తెలుగుదేశం పార్టీ 33 వేల ఎకరాలు ఎందుకు తీసుకుందంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన తెలుగుదేశం నాయకురాలు మీరు - నేనో.... మీ నాయకుడో... మా నాయకుడో ఇక్కడ కూర్చుని మాట్లాడితే కుదరదని - రైతులే దగ్గరే మాట్లాడాలంటూ ఘాటుగా సమాధానం చెప్పారు.
అంతే ఒక్కసారిగా స్టూడియోలో సీన్ వేడెక్కిపోయింది. మల్లెపూలు పెట్టకునే మీరు అంటూ జనసేన నాయకుడు మొత్తం చర్చను వేరే వైపు మళ్లించారు. ఈ హఠాత్తు పరిణామానికి కంగారు పడ్డ తెలుగుదేశం మహిళా నాయకురాలు నేను మహిళను - పువ్వులు పెట్టుకుంటే తప్పేంటి అంటూ ఆవేశంగా సమాధానం చెప్పారు. " మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా... నువ్వు ఎవరికి పుట్టావు. ఆడదానికే కదా"అంటూ మండిపడ్డారు. మరోవైపు జనసేన నాయకుడు ఇంతెత్తున లేస్తూ " మల్లెపూలు నలిపించుకోవడం కాదు" అంటూ ఎగిరెగిరి పడ్డారు. చర్చ తప్పు దోవ పడుతోందని యాంకర్ ఎంత హెచ్చరించిన ఇద్దరు నాయకులు వినకుండా రెచ్చిపోయారు. "మీ పార్టీ జనసేన నాయకుడే అలాంటి వాడైతే మీరు మరెలా ఉంటారు. మిమ్మల్ని మహిళలు చెప్పులతో కొడతారు" అని మండిపడ్డారు. ఒక దశలో తెలుగుదేశం నాయకురాలు... ఛీ ఇలాంటి వారిని పిలుస్తున్నారేమిటండీ అంటూ యాంకర్ పై మండిపడుతూ చర్చ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. జనసేన నాయకుడిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలుగుదేశం నాయకురాలు ప్రకటించడం చర్చలో కొసమెరుపు.