Begin typing your search above and press return to search.

జనసేన కీలక సమావేశం - పొత్తు మంటలు !

By:  Tupaki Desk   |   16 Jan 2021 3:30 PM GMT
జనసేన కీలక సమావేశం - పొత్తు మంటలు !
X
ఈనెల 21వ తేదీన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం జరగబోతోంది. అదికూడా తిరుపతిలో జరుగుతుండటం గమనార్హం. జనసేన పీఏసీ సమావేశానికి అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర ముఖ్యనేతలంతా పాల్గొనబోతున్నారు. తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పాల్గొనటమే టార్గెట్ గా పనవ్ పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షమైన బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకనే ఇక్కడి నుండి పోటీ చేయటం రెండుపార్టీలు దేనికదే ప్రతిష్టగా తీసుకున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండుపక్షాలూ మిత్రపక్షాలే అయినప్పటికీ ఒకదానిపై మరొకటి మైండ్ గేమ్ మొదలుపెట్టేశాయి. కమలంపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా ఎప్పటికప్పుడు తిరుపతిలో పర్యటిస్తు, నేతలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీచేయబోయేది తమ పార్టీనే అంటూ తాను ప్రకటించటమే కాకుండా ఇతర నేతలతో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు.

ఇదే సమయంలో వీర్రాజు టెక్నిక్ నే పవన్ కూడా ఫాలో అయిపోతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ చేయటమే టార్గెట్ గా పార్టీ తరపున కమిటి వేసి పర్యటనలు చేయిస్తున్నారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమబలం ఇది అని జనసేన నేతలతో చెప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే 21వ తేదీన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నారు.

నిజానికి తిరుపతి లోక్ సభ పరిధిలో రెండుపార్టీలకు కూడా అసలు బలమే లేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిపోటీ చేస్తే వచ్చిన ఓట్లు 16500. ఇక జనసేన మద్దతుతో పోటి చేసిన బీఎస్పీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు సుమారు 20 వేలు. ఈ ఇద్దరు అభ్యర్ధులకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు వచ్చిన ఓట్లు 25 వేలు. గట్టిగా చెప్పాలంటే రెండుపార్టీల వాస్తవ బలం ఇది. కానీ రేపు జరగబోయే ఉపఎన్నికలో గెలవబోయేది తామే అని రెండుపార్టీల నేతలు ఎవరికి వారే చెప్పేసుకుంటున్నారు. చూద్దాం 21వ తేదీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో జనసేన.