Begin typing your search above and press return to search.

పవన్నామస్మరణంతో సెల్ఫ్ గోల్... ?

By:  Tupaki Desk   |   3 Oct 2021 2:30 AM GMT
పవన్నామస్మరణంతో సెల్ఫ్ గోల్... ?
X
పవన్ కళ్యాణ్. మొదట సినీ నటుడు, తరువాత జనసేన నాయకుడు. ఏపీ రాజకీయాల్లో శూన్యత ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక థియరీ ప్రకారం వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని జనసైనికులు తొడ కొడుతున్నారు. అదెలా అంటే 2014 ఎన్నికల్లో అనుభవం అంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబుని జనాలు గెలిపించారు. ఇక ఒక్క చాన్స్ అంటూ 2019 నాటికి ముందుకు వచ్చిన జగన్ని కూడా గెలిపించారు. ఇపుడు అంటే 2024 నాటికి ఏపీలో జనాలకు ఏపీలో మిగిలిన ఏకైక విపక్ష లీడర్ పవన్ కళ్యాణ్ ఒక్కడే అని సైనికులు డిసైడ్ అయిపోయారు. అంటే బాబు, జగన్ చాన్సులు అయిపోయాయి కాబట్టి జనాలు తమ నేతకే పట్టం కడతారు అన్నది వారి అతి ఆశ.

సరే ఈ లాజిక్కు బాగానే ఉన్నా ఏపీలో జనసేన ఒక పార్టీగా ఇంకా పటిష్టంగా లేదు. పార్టీ నిర్మాణం అన్నది లేదు. మరో వైపు చూస్తే బలమైన ఒక సామాజిక వర్గంలోని మెజారిటీ అండదండలు తమకు ఉంటాయని జనసేన భావిస్తోంది. అయితే ఇది రేపటి రోజున ఏపీ సింహాసనం పట్టేయడానికి ఏ మాత్రం సరిపోదు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి అంటే కచ్చితంగా పొత్తులు అవసరం. అందువల్లనే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీ ఏపీలో ఎంత చూసినా ఎత్తిగిల్లడంలేదు. దాంతో పాటు కేంద్రంలోని మోడీ గ్రాఫ్ కూడా పడిపోతోంది.

దాంతో పాత మిత్రుడి వైపే జనసేన చూస్తోంది అంటున్నారు.మరి ఆ మిత్రుడు కూడా జనసేనతో చెలిమికి కోరుకుంటున్నాడు. టీడీపీ జనసేన కలిస్తే మాత్రం ఏపీ రాజకీయ సమీకరణలు బాగా మారిపోతాయి. దానికి పెద్దగా లెక్కలు కట్టాల్సిన అవసరంలేదు. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనలకు పడిన ఓట్లు వైసీపీ కంటే ఎక్కువ. గోదావరి, ఉత్తరాంధ్రాలోని చాలా చోట్ల ఇలా జరిగింది. దాంతో ఇపుడు ఈ పొత్తు వైసీపీకి నష్టం చేకూరుస్తుంది అనే అంటున్నారు. దాంతో వైసీపీ నేతలు పవన్ ని ఒక్క లెక్కన టార్గెట్ చేస్తున్నారు. పవన్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం ద్వారా జనసేనను హర్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక సొంతంగా పోటీ చేసే దమ్మూ ధైర్యం పవన్ కి లేదు అని కూడా వారు అంటున్నారు.

కానీ అవతల వైపు ఉన్నది చంద్రబాబు. ఆయన 2019 ఎన్నికల్లో ఒకసారి వైసీపీ ట్రాప్ లో పడి బీజేపీకి దూరం అయ్యారు. అలాగే పవన్ని దూరం చేసుకున్నారు. ఈసారి అలాంటి తప్పు చేయకూడదు అనుకుంటున్నారు. ఇక జనసేన వైపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని గద్దె దించాలన్నది అజెండాగా ఉంది. దాంతో పవన్ పొత్తు రాజకీయాలు వీడి ఒంటరిగా పోటీ చేస్తారు అన్నది జరిగేది కష్టమే అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పదే పదే పవన్ని టార్గెట్ చేయడం, ఆయన పొత్తు రాజకీయాల మీద మండిపడడం ద్వారా వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది అంటున్నారు. ఇది వైసీపీలో అభద్రతాభావానికి సూచిన అని ప్రత్యర్ధులు కూడా అంటున్నారు. అది మరింతగా ముదిరితే మాత్రం తీరని నష్టం ఫ్యాన్ పార్టీకే అని కూడా విశ్లేషిస్తున్నారు.