Begin typing your search above and press return to search.

అమరావతికి జనసేన సంపూర్ణ మద్దతు... పీకేకు తప్పలేదంతే

By:  Tupaki Desk   |   24 Sep 2020 4:45 AM GMT
అమరావతికి జనసేన సంపూర్ణ మద్దతు... పీకేకు తప్పలేదంతే
X
ఏపీలో ఇప్పుడు రాజధానిగా అమరావతిని కొనసాగించాలా? లేదంటే.. జగన్ సర్కారు చెబుతున్నట్లుగా మూడు రాజధానులకు ఓకే చెప్పాలా? అన్న విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రాజధానులకు వైసీపీ జైకొడుతుండగా... మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అన్న వాదనకు మద్దతు పలుకుతున్నాయి. ఈ విషయంలో నిన్నటిదాకా అంతగా క్లారిటీ ఇవ్వని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ మినహా మిగిలిన పార్టీల మాదిరే తాము కూడా రాజధాని అమరావతికే ఓటేస్తున్నట్లుగా పవన్ తేల్చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతికి మద్దతుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న వాదనను వినిపిస్తున్న జగన్ సర్కారు మూడు రాజధానులను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం జగన్ సర్కారు దూకుడుగానే వెళుతున్నా... హైకోర్టులో కొనసాగుతున్న విచారణ సదరు స్పీడుకు బ్రేకులు వేసేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో అసలు ఏపీ రాజధాని వ్యవహారంపై మీ స్టాండేమిటో చెప్పాలంటూ రాష్ట్రానికి చెందిన దాాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజధాని వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేసేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు కూడా తమ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే జనసేన మాత్రం నోరు విప్పలేదు. అయితే బుధవారం నాడు మాత్రం పవన్ కల్యాణ్ రాజధాని వ్యవహారంపై తమ వైఖరేమిటో క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిందేనని, మూడు రాజధానులకు తాము వ్యతిరేకమేనని కూడా పవన్ తన పిటిషన్ లో హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీలోని అన్ని ప్రాంతాలకు చెందిన నేతలతో చర్చించిన మీదటే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా పవన్ పేర్కొన్నట్లుగా సమాచారం. మొత్తంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నట్లుగా అమరావతిలో ఏకైక రాజధానిని కొనసాగించాల్సిందేనని పవన్ తేల్చేశారన్న మాట.

అయినా ఇంతకాలం దాకా ఈ విషయంపై పవన్ ఎందుకు క్లారిటీ ఇవ్వలేదన్న విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆది నుంచి రాజధాని అమరావతికి మద్దతుగానే నిలిచిన పవన్... ఎందుకనో హైకోర్టు కోరిన చాలా రోజులకు గానీ స్పందించలేకపోయారు. అధికార వికేంద్రీకరణతో అబివృద్ధి సాధ్యమంటూ జగన్ చెబుతున్న మాటను ఆది నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చిన పవన్... హైకోర్టు కోరినా కూడా తన నిర్ణయాన్ని చెప్పడంలో జాప్యం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు మూడు రాజధానులకు జైకొడుతుండగా... కోస్తాంధ్రవారు మాత్రం అమరావతికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలకు చెందిన తన పార్టీ నేతలతో చర్చించాకే కోర్టుకు తన అభిప్రాయాన్ని చెప్పాలని పవన్ భావించినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఆది నుంచి అమరావతికే మద్దతుగా నిలుస్తున్న పవన్... ఇతర ప్రాంతాల నేతల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకున్న తర్వాతే తన నిర్ణయాన్ని హైకోర్టుకు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించిన పవన్... ఆ మధ్య ఓ సారి అమరావతిలో పర్యటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మిగిలిన ప్రాంతాల వారి మాటలకు ప్రాధాన్యం ఇచ్చి అమరావతికి వ్యతిరేకంగా స్టాండ్ ను తీసుకుంటే... పార్టీకి పెద్ద నష్టమేనని పవన్ భావించినట్లుగా సమాచారం. మొత్తంగా అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత అమరావతిపై ఇదివరకటి తన స్టాండ్ కే కట్టుబడి ఉన్నట్లుగా పవన్ ప్రకటించారన్న మాట.