ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీ ని ఎన్టీయార్ స్థాపించారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో మొత్తం 294 సీట్లకు గానీ అభ్యర్ధులు టీడీపీకి లేదు. కాంగ్రెస్ లో పాతుకుపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దాంతో ఎన్టీయార్ సాహసించి ఒక ప్రయోగం చేశారు. అంతా కొత్తవారిని తెచ్చి అభ్యర్ధులుగా నిలిపారు. అంతా పాతికేళ్ల ప్రాయం వారే. రాజకీయం రంగు రుచి వాసన ఎరగని వారే.
అలా రాజకీయాల్లోకి వెల్లువలా వచ్చిన కొత్తదనాన్ని ప్రజలు మనసారా ఆహ్వానించారు. ఆ తరువాత ఇప్పటిదాకా చూస్తే వారే రాజకీయాల్లో ఉంటున్నారు తప్ప మరే పార్టీ ఆ తరహా ప్రయోగం మాత్రం చేయడంలేదు. అయితే ఆ తరువాత వచ్చిన పార్టీలు పరిమితమైన స్థాయిలోనే కొత్త వారిని ప్రోత్సహించాయి. అది కూడా వారికి ఉన్న పలుకుబడి ఇతరతా వ్యవహారాలు చూసి మాత్రమే.
అయితే ఇపుడు ఉన్న రాజకీయాల్లో జనసేన మళ్ళీ కొత్త వారితో రాజకీయం చేయలనుకుంటోందిట. ఈ మధ్యన జరిగిన పార్టీ సమావేశంలో మొత్తం 175 నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించుకోవాలని పార్టీలో లోతైన చర్చ సాగింది. ఇప్పటికి చూస్తే పార్టీ తరఫున నలభై నుంచి యాభై నియోజకవర్గాలకు మాత్రమే ఇంచార్జిలు ఉన్నారు. వీరిలో కూడా పార్టీ కోసం పనిచేసేవారు తక్కువే అని చెబుతారు. పవన్ కళ్యాణ్ వస్తేనే నాయకులు హడావుడి చేయడం తప్ప మిగిలిన వారు సొంతంగా కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడడం చేయడంలేదు.
దాంతో వారిలో కూడా చాలా మందిని మార్చి కొత్త వారిని తీసుకురావడం ద్వారా పార్టీని కదిలించాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పనిచేయని వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. పనిచేయని వారు వద్దు అన్నట్లుగానే గట్టి సందేశాన్ని పంపించారు. అలా కాకుండా జనసేనను జనంలో నిలబెట్టి రానున్న కాలమంతా పార్టీ జెండాను మోసేవారికే అవకాశాలు ఇవ్వాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఇప్పటికిపుడు ఒక వంద నియోజకవర్గాలకు జనసేనకు నాయకులు కావాలి. దాని కోసం పాత వారి కంటే కూడా కొత్త ముఖాలకే జనసేనాని ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. అంటే ఏపీ రాజకీయాల్లోకి మళ్లీ కొత్త నెత్తురు ప్రవేశిస్తోంది అన్న మాట.
పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ నాయకత్వంలో కొత్త వారు ఉత్సాహవంతులు రాజకీయాల్లో చేరి తమ సత్తా చాటితే జనం మెచ్చితే వారు నాయకులుగా ఎదుగుతారు. పది కాలాల పాటు వారి నాయకత్వం వర్ధిల్లుతుంది. అలాగే పవన్ కూడా కొత్త నెత్తురుని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అరుదైన ఘనతను సాధించిన వారు అవుతారు.
ఏది ఏమైనా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మాత్రం జనసేనకే దక్కుతోంది. దాంతో పవన్ కనుక రిస్క్ చేసి కొత్త వారికి చాన్స్ ఇస్తే జనసేనకు ఇపుడు లభిస్తున్న ఆదరణను బట్టి ఏపీ రాజకీయమే టోటల్ గా చేంజి అవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి కొత్త ముఖాలలో ఎందరు తమ నాయకత్వ పటిమని చాటుకుని రేపటి రాజకీయానికి సారధులుగా నిలుస్తారో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.