Begin typing your search above and press return to search.

వైసీపీతో క‌లిసి ప‌నిచేస్తాం : జ‌న‌సేన‌

By:  Tupaki Desk   |   7 Oct 2017 5:20 PM GMT
వైసీపీతో క‌లిసి ప‌నిచేస్తాం : జ‌న‌సేన‌
X
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌ల మ‌ధ్య బంధం ప్రశ్నార్థ‌కంగా మారుతోంది. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు...జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌ను లైట్ తీసుకుంటుంటే....ప‌వ‌న్ సైతం ఏ మాత్రం త‌గ్గ‌కుండా...``దృష్టి మ‌ళ్లించేవారు...ప‌క్క చూపుల‌తో ప‌రేషాన్ చేసే వాళ్ల‌తో జాగ్ర‌త్త‌`` అంటూ త‌న అభిమానుల‌కు సూచ‌న‌లు ఇస్తూ ప‌రోక్షంగా టీడీపీ ఎత్తిపోడుస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఈ రెండు పార్టీల క‌లివిడి త‌నంపై అంద‌రిలోనూ సందేహాలు నెల‌కొంటున్న క్ర‌మంలో జ‌న‌సేన మీడియా హెడ్ హ‌రిప్ర‌సాద్ మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చారు. అంతేకాకుండా...వైసీపీతో దోస్తీకి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చారు.

విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన జ‌న‌సేన పార్టీ నేత‌...ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌ద‌న్న మంత్రి పితాని వ్యాఖ్య‌ల‌ను హ‌రిప్ర‌సాద్ ఎద్దేవా చేశారు. ఆయ‌న ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నార‌ని, బ‌య‌ట‌కొచ్చి ప్ర‌జాద‌ర‌ణ చూసి మాట్లాడాల‌ని ఎద్దేవా చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుకి తెలిసి టీడీపీ నేత‌లు ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తాము భావించ‌డం లేద‌ని అన్నారు. ఈ కామెంట్లు టీడీపీ-జ‌న‌సేన దోస్తీపై ప్ర‌భావం చూపించ‌వా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు.టీడీపీ- జ‌న‌సేన దోస్తీ 2014 ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని తేల్చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ద‌మ‌ని సంచ‌ల‌న విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

కాగా, సాక్షాత్తు వైసీపీ మీడియా విభాగం అధినేతనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీతో త‌మ ప్ర‌యాణం సాగుతుంద‌ని ప్ర‌కటించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇర‌కాటంగా మారిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌న‌సేన ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డం...పైగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీతో ముందుకు సాగుతామ‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే...టీడీపీ నేత‌లు ప‌వ‌న్‌ ను రెచ్చ‌గొట్టిన ఫ‌లిత‌మేన‌ని అంటున్నారు.