సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై జనసేన కార్యకర్తలు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ పై పోసాని వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నోటికొచ్చినట్టు పవన్ ఫ్యామిలీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోసానిపై దాడికి కూడా జనసేన కార్యకర్తలు రావడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ నేతృత్వంలో నిన్న ప్రెస్ క్లబ్ కు వచ్చి పోసానిపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం వీరు పోసాని వ్యాఖ్యలను ఖండిస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరుష పదజాలం వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. జనసేన తెలంగాణ మహిళా విభాగానికి చెందిన నేతలు కూడా సైబరాబాద్ కమిషనర్ కు పోసానిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే పోసాని పై జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదు అంశంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు న్యాయసలహా(లీగల్ ఒపినీయన్) కోరారు. న్యాయ సలహా వచ్చాక ఫిర్యాదుపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరోవైపు పోసాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసుల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నారు.