Begin typing your search above and press return to search.
హత్యకు ఖండన..లక్షమంది పేరుతో పవన్ హెచ్చరిక
By: Tupaki Desk | 7 Sept 2017 11:29 PM ISTకన్నడ సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రియాక్టయ్యారు. హత్యపై ఆయన స్పందిస్తూ హిందూత్వం - బహుళ నైతికతలు - బహుళ మతాలు - బహు భాషలు - బహు సంస్కృతులు - సమాజం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. సామాజిక న్యాయం - సామాజిక బాధ్యతను గుండెల్లో నింపుకున్న జర్నలిస్ట్ ను హతమార్చి భావప్రకటనను భగ్నం చేసామనుకుంటే పొరపాటేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భిన్న జాతులు - కులాలు - మతాలు - వర్గాలు - సంస్కృతుల వాళ్ళు జీవించే ఈ దేశం లో ఎదుటి వ్యక్తి అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు వారిని హతమార్చాలనుకోవడం దారుణమని పవన్ తప్పుపట్టారు.
నుదుట బుల్లెట్ పేరుతో ట్వీట్ ప్రారంభించిన పవన్...``ఈ హత్య మన జాతి మూలాలనే ప్రశ్నిస్తోంది. వాస్తవాలు తెలియకుండా హిందుత్వ శక్తులే ఈ హత్యకు కారణమని నేను అనను`` అని పవన్ స్పష్టం చేశారు. గౌరి లంకేశ్ హత్యోదంతం సందర్భంగా ఆర్థికవేత్త హెర్నాండో డిసోటో మాటలను పవన్ గుర్తు చేశారు. ``సాధారణ కలాన్ని నమ్ముకున్న సీనియర్ జర్నలిస్ట్ ని హతమార్చి గెలిచామనుకుంటే పొరపాటు.మన ప్రత్యర్థికి చర్చించటానికి అంశాలు కరువయినప్పుడే మందుగుండు అవసరం ఏర్పడుతుంది. ఇటువంటి పిరికి చర్యలు వారి ఉనికిని ప్రశ్నిస్తాయి. గౌరి లంకేశ్ ని దారుణ హత్య చేసి కథ ముగిసిందనుకోవద్దు. అటువంటి గౌరి లంకేశ్ లు కోట్లమంది పుట్టుకొస్తారు. గౌరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా`` అని ట్విట్టర్ లో గౌరి లంకేశ్ హత్యపై పవన్ కళ్యాణ్ స్పందించారు. లంకేశ్ హత్య నేపథ్యంలో తన బాధను మాటల్లో చెప్పలేనని అన్నారు.
