Begin typing your search above and press return to search.

జ‌న‌సేన తృతీయ కూట‌మి.. సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 1:30 PM GMT
జ‌న‌సేన తృతీయ కూట‌మి.. సాధ్య‌మేనా?
X
రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. అయితే.. అది అన్ని స‌మ‌యాల్లోనూ.. అన్ని వేళ‌లా సాధ్య ప‌డుతుందా? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కీల‌క‌మైన పార్టీల బ‌లం లేకుండా.. భారీ వ్యూహాన్ని సిద్ధం చేసుకు న్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇప్పుడు ఈ వాద‌న ఎందుకు తెర‌మీదికి వ‌చ్చిందంటే.. తాజాగా తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తృతీయ కూట‌మి దిశ‌గా అడుగులు వేయాల‌న్నారు.

అది కూడా ఏపీలో తృతీయ కూట‌మి.. అనే మాట ప‌వ‌న్ నోటి నుంచి రావ‌డం.. ఇదే తొలిసారి. ఇంత‌కీ ప‌వ‌న్ ఏమ‌న్నారంటే.. వైసీపీని గ‌ద్దె దించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను క‌న్నీళ్లు పెట్టిస్తున్న వైసీపీకి అధికారంలో ఉండే అర్హ‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సో..తాము వైసీపీని గ‌ద్దె దించాల‌నే కాన్సెప్ట్‌కే ప్ర‌ధ‌మ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. త‌మ రాజ‌కీయ ల‌క్ష్యం కూడా ఇప్పుడు అదేన‌ని చెప్పేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఈ మాట‌ను ఇప్ప‌టికే ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో చెప్పి ఉన్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో క‌లిసి అడుగులు వేస్తారేమో.. అని అనుకుంటే.. ఇప్పుడు పొర‌పాటే. ఎందుకంటే.. ఈ విష‌యంలోనూ ప‌వ‌న్ ఆస‌క్తిక ర వ్యాఖ్య చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని కానీ, టీడీపీని కానీ.. మోయాల్సిన అవ‌స‌రం..వాటికి ద‌న్నుగా నిల‌వాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు. అంటే.. టీడీపీతో పొత్తు లేద‌ని దాదాపు చెప్పేశారు.. అనుకుందాం.. అయితే.. ఆయ‌న తృతీయ కూట‌మి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

మ‌రి ఈ తృతీయ కూట‌మి అంటే.. ఎవ‌రు.. ఎలా సాధ్యం..? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. గ‌తంలో 2009లో వైఎస్‌ను ఎదుర్కొనేందుకు ప‌లు పార్టీలు క‌లిసి.. మ‌హాకూట‌మిగా జ‌త‌క‌ట్టాయి.వీటిలో టీడీపీ వంటిబ‌ల‌మైన పార్టీ కూడా ఉంది. కానీ, ఇప్పుడు టీడీపీని ప‌క్క‌న పెట్టి.. తృతీయ కూట‌మి అంటే.. ఎలా? అనేదే ప్ర‌శ్న‌. ఇప్పుడున్న ప రిస్థితిలో టీడీపీని ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ ముందున్న పార్టీలు.. క‌మ్యూనిస్టులు, బీఎస్పీ, ఆప్‌, లోక్‌స‌త్తా(ఇంకా ఉంటే), పాల్ గారి ప్ర‌జాశాంతి పార్టీ. వీటితో క‌లిసి తృతీయ కూట‌మి ఏర్పాటు చేస్తారా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. తృతీయ కూట‌మి ఏర్పాటు అంటే.. అంత ఈజీకాదు. అందునా.. బ‌ల‌మైన ఓటు బ్యాంకు.. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్న వైసీపీని ఢీకొట్టేందుకు.. అంతే బ‌ల‌మైన పార్టీల‌ను ప‌వ‌న్ తోడ్కొని ముందుకు సాగాలి.కానీ, ఈ ప‌రిణామాల‌ను ఆయ‌న ఊహించ‌కుండా.. తృతీయ కూట‌మి రాగం తీయ‌డం.. చూస్తే.. వ్యూహం లేదా? లేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అవ‌గాహ‌న లేదా? అనే సంశ‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. ప‌వ‌న్ చెబుతున్న తృతీయ కూట‌మి ఎలా ఉంటుందో చూడాలి.