ఏపీలో గత ఏప్రిల్ లో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. చాలా వరకు జిల్లాల్లో కౌంటింగ్ అయిపోయింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం సోమవారం కూడా కొనసాగనుంది. అయితే.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీనే విజయదుందుభి మోగించింది. గతంలో లేని రికార్డును సైతం వైసీపీ సృష్టించింది. అయితే.. పరిషత్ ఎన్నికల్లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. 2020లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. జనసేన, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు.. వైసీపీ అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే. కరోనా నేపథ్యంలో అప్పటి ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ ఎన్నికలను వాయిదా వేశారు. తర్వాత.. ఈ ఏడాది మార్చిలో కరోనా తగ్గుముఖం పట్టిందని పేర్కొంటూ.. తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినా.. పంచాయతీలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వరకే నిమ్మగడ్డ పరిమితమయ్యారు. దీంతో ఆయన తర్వాత.. కమిషనర్‌గా వచ్చిన నీలం సాహ్ని.. వచ్చీ రావడంతోనే పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే.. ఈ గ్యాప్‌లో చాలా మంది జనసేన, టీడీపీ , బీజేపీ, కాంగ్రెస్ తరఫున గత ఏడాది నామినేషన్లు వేసిన వారు.. స్వచ్ఛందంగా విరమించుకుని వైసీపీలోకి చేరిపోయారు.
``ఆ మాపార్టీలకు బలం ఎక్కడుంది.. వైసీపీనే అన్నీ క్లీన్ స్వీప్ చేస్తుంది`` అనుకుని టీడీపీ నుంచి జనసేన నుంచి.. కూడా చాలా మంది నామినేషన్ వేసిన అభ్యర్థులు.. వాటిని ఉపసంహరించుకోకుండానే.. వైసీపీలో చేరిపోయారు. అయితే.. ఇలా వచ్చిన వారిలో.. తాజాగా జరిగిన కౌంటింగ్‌లో ఒక చోట జనసేన అభ్యర్థి.. మరోచోట.. టీడీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఇప్పుడు వీరు వైసీపీలో ఉన్నారు. మరి ఇప్పుడు వీరు ఏం చేస్తారు? అనేది ప్రశ్న.
+ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిధిలోని రావిపాడు ఎంపీటీసీ స్థానానికి బొచ్చెల తాతారావు.. 2020లో జనసేన తరఫున నామినేషన్ వేశారు. తర్వాత.. ఆయన వైసీపీలో చేరిపోయారు. తాను ఏం గెలుస్తానని అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన కౌంటింగ్‌లో.. తాతారావు.. జనసేన తరఫున విజయం సాధించారు. ఇక్కడి ప్రజలు వైసీపీ అభ్యర్థి ములగాల వెంకటేశ్వరరావును పక్కన పెట్టారు. తాతారావుకు.. 937 ఓట్లు రాగా.. వెంకటేశ్వరరావుకు 859 ఓట్లు వచ్చాయి.
+ విజయనగరం జిల్లా కొత్తవలస-3 ఎంపీటీసీ స్థానంలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఈ స్థానానికి 2020లో టీడీపీ తరఫున పెదిరెడ్ల లక్ష్మి నామినేషన్ వేశారు. అయితే.. ఈ ఏడాది ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆమె వైసీపీలో చేరిపోయారు. పార్టీ ఏం గెలుస్తుందిలే అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన కౌంటింగ్‌లో లక్ష్మికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు.