Begin typing your search above and press return to search.

అరవైలో ఇరవై...టీడీపీ జనసేన పొత్తు కసరత్తు

By:  Tupaki Desk   |   23 Jan 2023 1:30 AM GMT
అరవైలో ఇరవై...టీడీపీ  జనసేన పొత్తు కసరత్తు
X
ఏపీలో జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంది అని అంటున్నారు. 2024లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారు. లేక విడిగా పోటీ చేస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. ఇలా చాలా సాధారణంగా కూడా దీని మీద విశ్లేషణ చేయవచ్చు. దానికి కారణం 2014, 2019లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలను బట్టి జనసేన తాను సొంతంగా పోటీ చేసి అధికారాన్ని కైవశం చేసుకోకపోయినా మరో పార్టీని ఓడించే గెలిపించే శక్తిని కలిగి ఉందని మాత్రం అర్ధమైంది.

జనసేన తొలి దెబ్బ అలా జగన్ కి తగిలితే మలిదెబ్బ చంద్రబాబుకు తగిలింది. అందుకే చంద్రబాబు జనసేనతో పొత్తుకే సై అంటున్నారు. అయితే ఈ పొత్తుల కీలకమైన అంశం అధికారంలో వాటా అని అంటున్నారు. తాజాగా రాయలసీమ టూర్ లో సైతం జనసేన నాయకుడు నాగబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ఈసారి సీఎం కావాల్సిందే అని చెప్పేశారు. పొత్తులు ఎలా ఉన్నా అంతిమంగా అది జనసేనకు లాభాన్ని కలిగించాలనే చూస్తున్నారు అని అనుకోవాలి.

మరి చంద్రబాబు అయితే పొత్తులలో భాగంగా కొన్ని సీట్లు మంత్రి పదవులు ఇద్దామని అనుకుంటున్నారు. ఇక్కడే లడాయి వస్తోంది. రాజకీయ వర్గాలలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక జనసేన అరవై సీట్లను డిమాండ్ చేస్తోంది అని అంటున్నారు. తమ గ్రాఫ్ బాగా పెరిగింది కాబట్టి ఈ సీట్లు ఇవ్వాల్సిందే అన్నది జనసేన వాదనగా ఉంది అంటున్నారు.

ఈ సీట్లు కూడా ఉభయగోదావరి, ఉత్తరాంధ్రాలో చెరి డజన్ సీట్లు మిగిలిన చోట్ల జిల్లాలలో బలమున్న స్థానాలలో జనసేన పట్టుబట్టి మరీ కోరుతోంది అంటున్నారు. దీని వల్ల ఏపీ అంతటా జనసేన జెండా ఎగరడంతో పాటు అరవైలో కనీసం నలభైకి పైగా సీట్లు గెలుచుకున్నా రేపటి ప్రభుత్వంతో అత్యంత కీలకమైన భూమిక పోషించడానికి వీలు ఉంటుందని జనసేన లెక్కేస్తోంది అని అంటున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే పదిహేను నుంచి మొదలెట్టి ఇరవైతో తెగ్గొట్టాలని చూస్తోంది అని అంటున్నారు. జనసేన కి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై సీట్లకు మించి ఇవ్వకూడదని తెలుగుదేశంలో కూడా చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే తగిన విధంగా బలమైన అభ్యర్ధులు ఉన్నారా అన్న చర్చ కూడా తెలుగుదేశంలో సాగుతోందిట.

ఒకవేళ సీట్లు తీసుకుని సరైన అభ్యర్ధులను ఎంపిక చేసుకోకపోతే అది ఉత్తపుణ్యాన వైసీపీకే ధారపోసినట్లుగా ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ విషయం మీదనే తెలుగుదేశం సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికలు ఆషామాషీగా జరగవు అని అంటున్నారు. ఢీ అంటే ఢీగా ఈ ఎన్నికలు ఉంటాయని, అన్ని రకాలుగా అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతీ సీటూ కీలకమే అని అంటున్నారు. అలాంటిది సీట్లు జనసేనకు ఎక్కువ ఇస్తే అది రిస్క్ అవుతుందా అన్న చర్చ కూడా వస్తోందిట.

అయితే అరవై సీట్లకు తక్కువ ఇస్తే కూడదని జనసేన నుంచి కూడా వినిపిస్తున్న మాట అంటున్నారు. తెలుగుదేశం రాజకీయ అవసరమే ఆసరాగా చేసుకుని ఏపీ రాజకీయాల్లో అల్లుకుపోవాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. తాము జూనియర్ పార్టనర్ గా ఉండకూడదని కూడా భావిస్తోందిట. మొత్తానికి అరవైలో ఇరవై అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఈ కసరత్తు ఏంటో తేలాకనే పొత్తుల విషయంలో చర్చలు ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.