Begin typing your search above and press return to search.

టీడీపీతో బీజేపీ : కండిషన్లు అప్లై...?

By:  Tupaki Desk   |   22 May 2022 8:03 AM GMT
టీడీపీతో బీజేపీ :  కండిషన్లు అప్లై...?
X
ఏపీలో ఎన్నికలు ఇప్పటప్పట్లో లేవు కానీ పొత్తుల విషయంలో మాత్రం తీవ్రాతితీవ్రంగా చర్చలు అయితే సాగుతున్నాయి. దానికి కారణం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని ఆయన ప్రతిన పూనుతున్న వైఖరి. ఇక అలాగే చంద్రబాబు సైతం వైసీపీని ఢీ కొట్టడానికి అంతా కలవాలని ఇస్తున్న పిలుపులు. వీటి సారాంశం ఏంటి అంటే ఏపీలో 2014 పొత్తులను రిపీట్ చేయాలనే.

మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా. అంటే లేదు అని బీజేపీ నేతలు అంటున్నారు. మా మోడీని విమర్శించి వ్యక్తిగతంగా కూడా ఆయన ఫ్యామిలీని టచ్ చేసిన టీడీపీతో పొత్తు ఏంటి అన్నది వారి భావన. ఇక కేంద్రంలో మోడీని గద్దె దించాలంటూ 2019 ఎన్నికల వేళ దేశమంతా తిరిగి ఫుల్ టెన్షన్ పెట్టేసిన బాబుని మోడీ అమిత్ షా అసలు మరచిపోలేదు అని కూడా అంటారు.

మొత్తానికి అప్ప అరాటమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఒప్పిస్తాను అని చెబుతున్నా రాజకీయాలు ఏమీ తెలియకుండా ఆ పార్టీ నేతలు ఉన్నారు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండబోదు, ఇక దానా దీనా తమ నేస్తం పవన్ కోరిక మేరకు టీడీపీతో పొత్తులకు సై అన్నా కొరుడు పడని కండిషన్లు పెట్టడం ద్వారా టీడీపీయే పొత్తు తెంచుకుంది అన్నట్లుగా కధ నడిపేందుకు కూడా బీజేపీ ప్లాన్ బీ సిద్ధం చేసింది అంటున్నారు.

అదెలా అంటే ఏపీలో బీజేపీ, జనసేనా టీడీపీ కలసి కూటమి కట్టాలీ అంటే మొత్తం 175 సీట్లలో సగం సగం పంచుకోవాలన్నది ఈ కండిషన్. అంటే టీడీపీ సగానికి పోటీ చేస్తే మరో సగానికి జనసేన, బీజేపీ పోటీ చెస్తాయి అన్న మాట. అదే విధంగా ఎన్నికల తరువాత ఈ కూటమి గెలిస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలి. ఈ విధంగా టీడీపీ అంగీకరిస్తేనే తప్ప పొత్తు పెట్టుకోమని బీజేపీ నేతలు అంటున్నారు.

అంటే పాము చావకుండా కర్ర విరగకుండా ఈ ప్లాన్ బీ ఉంటుంది అన్న మాట. మరీ ప్లాన్ ఏ ప్రకారం పొత్తులకు మేము దూరం బాబుతో వద్దు అంటే పవన్ కి కోపం వస్తోంది. అలా కాకుండా పవన్ని తమ మిత్రుడిగా ఉంచుకోవడానికి ప్లాన్ బీని బీజేపీ అప్లై చేస్తుంది అని చెబుతున్నారు. ప్లాన్ బీ అంటే పవన్ కి కూడా సంతోషమే కదా. ఎటూ ఎక్కువ సీట్లు వస్తాయి. పైగా సీఎం పోస్ట్ తనకే ఇమ్మని బీజేపీ వారు కోరుతారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇబ్బంది పడేది కచ్చితంగా టీడీపీనే.

అందుకే వారు పొత్తుకు ససేమిరా అంటారు. అలా వారు అనాలన్నదే బీజేపీ ఎత్తుగడ. మొత్తానికి ఏ పవన్ని అయితే ముందు పెట్టి పొత్తు కధ నడుపుతున్న చంద్రబాబును ఎదుర్కోవాలంటే అదే పవన్ని తాము ముందు పెట్టి బాబు నోట వద్దు బాబోయ్ ఈ పొత్తులు అనిపిస్తారు అన్న మాట. చూడాలి మరి ఈ ఎత్తులు పొత్తులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో.