Begin typing your search above and press return to search.

పొత్తులు స‌రే.. క‌లిసి వ‌చ్చేదెవరు? మేధావుల‌ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   21 March 2022 4:30 AM GMT
పొత్తులు స‌రే.. క‌లిసి వ‌చ్చేదెవరు?  మేధావుల‌ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌
X
ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారంలో నుంచి దింపేయ‌డ‌మే ల‌క్ష్యం! ఈ క్ర‌మంలో వచ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో చిత్ర‌మైన పొత్తులు తెర‌మీదికి వ‌స్తున్నాయనే సంకేతాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో మాట్లాడుతూ.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌కుండా చూస్తాన‌ని అన్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌నూ స‌మైక్యం చేసి.. మ‌హాకూట‌మిగా రంగంలోకి దిగిపోతున్నారనే సంకేతాల‌ను ఇచ్చారు.

ఈ క్ర‌మంలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాలు-ప్ర‌జాశాంతి లేదా.. చిన్నాచిత‌కా పార్టీలు అన్నీ ఒకే గొడుగు కింద‌కు వ‌స్తాయని భావించాలి. కానీ, బీజేపీ మాత్రం ఇప్ప‌టికీ.. టీడీపీతో క‌లిసేది లేద‌ని.. జ‌న‌సేన మాత్ర‌మే త‌మ విశ్వ‌స‌నీయ మిత్ర‌ప‌క్ష‌మ‌ని ప‌దే ప‌దే చెబుతోంది. మ‌రోవైపు.. వామ‌ప‌క్షాలు.. బీజేపీతో క‌లిసి ఉండేందుకు సిద్ధంగా లేవు. అంటే.. జ‌న‌సేన‌-టీడీపీ మాత్ర‌మే క‌లిసి పోటీ చేయాలి. లేదా కాంగ్రెస్ క‌లిసి వ‌స్తే.. దానిని క‌లుపుకోవాలి. కానీ, కాంగ్రెస్ ఇందుకు సిద్ధ‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

ఇక్క‌డ మ‌రో ప్ర‌ధాన ఇబ్బంది ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీతో క‌లిసి ఉన్న ప‌వ‌న్‌.. పొత్తులో భాగంగా.. టీడీపీతో తాము క‌ల‌బోమ‌ని చెబుతున్న బీజేపీని వ‌దులుకుంటే.. అది మ‌రింత ఇబ్బందికాదా.. రేపు బీజేపీ నేత‌లు..ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్ప‌రా? అప్పుడు ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, క‌మ్యూనిస్టులు.. టీడీపీకి, జ‌న‌సేన‌కు సానుకూలంగా నే ఉన్నారు. కానీ, ఎటొచ్చీ.. బీజేపీతోనే వ్య‌తిరేక‌త‌. అంటే.. మొత్తంగా బీజేపీ ఇప్పుడు.. ప్ర‌తిప‌క్షాలకు పంటికింద రాయిగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎవ‌రితో పొత్తుకు దిగుతార‌నేది మ‌రో చ‌ర్చగా ఉంది. స‌రే.. ఏది ఎలా ఉన్నా.. టీడీపీ-జ‌న‌సేన మాత్రం ప‌క్కాగా క‌లిసిపోవ‌డం.. ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌డు .. చంద్ర‌బాబు ఒక సానుకూల వ్యూహం వేస్తున్నార‌నే టాక్ టీడీపీలో వినిపిస్తోంది. టీడీపీలోనే కొంద‌రు నాయ‌కులను జ‌న‌సేనలోకి పంపుతార‌ని అంటున్నారు. వారు జ‌న‌సేన త‌ర‌ఫున‌.. టికెట్లు తెచ్చుకుని విజ‌యం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

అంటే.. జ‌న‌సేన‌లో ఉన్నా కూడా.. చంద్ర‌బాబు మాట‌కు వాల్యూ ఇచ్చే నాయ‌కులుగా వారు ఉంటార‌న్న మాట‌. గ‌తంలోనూ బీజేపీ త‌ర‌ఫున గెలిచిన కామినేని శ్రీనివాస‌రావు.. విష్ణుకుమార్ రాజు వంటివారు.. చంద్ర‌బాబుకు అనుకూల నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాల‌ను బీజేపీ పెద్ద‌లు వ్య‌తిరేకించినా.. ఇలాంటి వారు మాత్రం సానుకూలంగా స్పందించారు.

ఇప్పుడు కూడా అదే వ్యూహంతో చంద్ర‌బాబు ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని మేధావులు చెబుతున్నారు. ఏదేమైనా.. పొత్తులు బాగానే.. క‌లిసి వ‌చ్చే నేత‌ల‌తోనే స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని మేధావులు చెబుతున్నారు. వీటిని అధిగ‌మించ‌డ‌మే చంద్ర‌బాబుకు పెద్ద‌టాస్క్‌గా ఉంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.